తెలంగాణ తెలుగుదేశంపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతుండటంతో రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రేవంత్ ఒక్కరే వెళ్లడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చినట్లయింది. రేవంత్ ఒక్కరే ఢిల్లీచేరుకోవడంతో అక్కడి మీడియా వెంట పడింది. దీంతో రేవంత్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని, టీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకే వచ్చానన్నారు. అయితే ఈసీకి ఫిర్యాదు టీటీడీపీ చేయదలచుకుంటే రేవంత్ ఒక్కరే ఢిల్లీ పర్యటనకు ఎందుకు వస్తారన్న అనుమానం కూడా కలుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఇటీవల తన ప్లీనరీ జరిగినప్పుడు కూలీ చేసి లక్షలకు లక్షలు సంపాదించారన్న దానిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడానికి మాత్రమే వచ్చానని రేవంత్ చెబుతున్నారు. అయితే ఇది నమ్మదగినదిగా లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.
రాహుల్ ను కలిసేందుకేనా?
కేసీఆర్ సర్కార్ ను టీడీపీ ధీటుగా ఎదుర్కొనలేకపోతుందనే ఆవేదనతో ఉన్నారు రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటుండటం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ టీడీపీని పట్టించుకోకపోవడం, ఏపీ టీడీపీ నేతలు కేసీఆర్ ను పొగుడుతుండటం రేవంత్ కు మింగుడుపడకుండా ఉంది. దీంతో రేవంత్ పార్టీ మారతారన్న ప్రచారం జోరుగాసాగుతోంది. తన చేరికపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దనే స్పష్టత తీసుకోవాలని, తన అభిప్రాయాలను వెల్లడించాలన్న నిర్ణయంతోనే రేవంత్ రెండురోజులుగా హస్తినలో ఉన్నట్లు పెద్ద ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటన వెలువడిన డిసెంబరు 9వ తేదీనే రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని, ముందుగా రాహుల్ తోనూ, కాంగ్రెస్ పెద్దలతోనూ మాట్లాడేందుకు ఢిల్లీకి వచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ పార్టీల్లో పెద్ద చర్చనీయాంశమైంది.