ఢిల్లీ లో గర్జించిన తెలుగు నేతలు

Update: 2018-03-07 03:30 GMT

ఎపి సమస్యలు విభజన హామీలపై, ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు బిజెపి సర్కార్ పై ముప్పేట దాడి కొనసాగిస్తూనే వున్నాయి. ఢిల్లీ వీధులు అన్ని ఆంధ్రులకు అన్యాయంపై హోరెత్తిపోతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ కేంద్రంగా ప్రధాన పక్షాలన్నీ ఎవరి స్థాయిలో వారు ఉద్యమిస్తూనే ఉన్నారు. కానీ చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయినా ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తూనే వున్నారు. తెలుగు ఎంపీలు, వివిధ పార్టీల నేతలు ఏమన్నారో ఒక్కసారి చూద్దాం ....

జెసి : తిరుమల వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి ప్రధాని తప్పారని గోవిందా గోవిందా అంటూ తనదైన శైలిలో పదునైన వ్యాఖ్యలు చేశారు జెసి దివాకరరెడ్డి. దేవుడు అంటే నమ్మే పార్టీ ఇలా నమ్మించి ముంచిందన్నారు ఆయన. ఇక ఏపీకి వారు ఏమి చేయరు.

టీజి. వెంకటేశ్: కేంద్రం పరిస్థితి గమనిస్తే దీర్ఘ కాల పోరాటం చేస్తే కానీ ప్రయోజనం లేదు.

కెవిపి : మోడీ కళ్ళు తెరవాలి , విభజన హామీలు అమలు చేసి తీరాలి, ఎన్నికల మ్యానిఫెస్టో లో ఇచ్చిన హామీలు అన్ని అమలు అయ్యే వరకు ఉద్యమం ఆగదు.

మురళీ మోహన్ : అదిగో చేస్తాం ఇదిగో చూస్తాం అంటూ ఇప్పటి వరకు గడుపుకుంటూ వచ్చారు. ఇక ఆ మాటలను నమ్మే పరిస్థితి లేదు. చేసి చూపాలిసిందే. ఇక వినే ఓపిక లేదు.

మేకపాటి : ఎపి కి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే వరకు పోరాటం విరమించేది లేదు. ఏ హామీలు ఇచ్చారో అన్ని నెరవేర్చవలిసిందే.

మిధున్ రెడ్డి : రాష్ట్ర సమస్యలపై కేంద్రం పై అలుపెరగని పోరాటమే చేస్తుంది. హామీలు అమలు అయ్యేవరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. అవిశ్వాసం తెస్తాం. చివరిగా రాజీనామాలకు సైతం సిద్ధ పడుతున్నాం.

రాఘవులు : నాలుగేళ్లపాటు ప్రజలను మభ్యపెట్టి బిజెపి తో అంటకాగి ఏపీకి అన్యాయం చేశారు. మొన్నటి వరకు ప్యాకేజి అన్నారు ఇప్పుడు హోదా అంటూ మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఎన్నాళ్ళు ఇలా మభ్య పెడతారు మోసం చేస్తారు.

నా తొలిసంతకం హోదా పైనే అన్న రాహుల్ :

తమ పార్టీ అధికారంలోకి వచ్చి తాను ప్రధాని అయితే తొలిసంతకం ఎపి ప్రత్యేక హోదాపై చేస్తా. పార్లమెంట్ చేసిన చట్టాలకు నాటి ప్రధాని ఇచ్చిన హామీలకు విలువ లేనప్పుడు దేశ చట్టసభలపై ప్రజలకు గౌరవం ఏముంటుంది ? విశ్వాసం ఏముంటుంది ?

రఘువీరా : ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి, విభజన హామీలు అమలు చేయాలిసిందే, ప్రధాని గతంలో చెప్పినవన్నీ చేసి తీరాలి. అప్పటిదాకా వెనక్కి తగ్గం.

పల్లం రాజు: ఢిల్లీ వీధుల్లో జరిగిన అన్యాయంపై పోరాడతాం. మరింత వత్తిడి తెస్తాం. రాహుల్ ను ప్రధానిగా చేసి అన్యాయానికి న్యాయం చేసి తీరతాం.

సిపిఎం మధు : పార్లమెంట్లో చట్టం చేస్తే అమలు చేయడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా ?

సిపిఐ రామకృష్ణ : తెలుగు వారంతా ఢిల్లీ కేంద్రంగా ఉద్యమిస్తుంటే చంద్రబాబు అసెంబ్లీలో కూర్చుని ఏంచేస్తారు. తక్షణం ఆయన అసెంబ్లీని వాయిదా వేసి ఢిల్లీ వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహించాలి.

సోమనాధ్ : ఎపి న్యాయమైన పోరాటానికి ఆప్ పూర్తి మద్దత్తు ఇస్తుంది. పార్లమెంట్ లో తెలుగు వారికి అండగా నిలుస్తాం.

Similar News