ఏపీలో జరగుతున్న రాజకీయ పరిణామాలతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమయింది. ఈ నెల 23వ తేదీన హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి రావాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి హోమంత్రిత్వ శాఖ సమాచారం పంపింది. పూర్తిస్థాయి సమాచారంతో రావాలనికోరింది. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయినట్లే కన్పిస్తోంది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో పాటు, రైల్వే అధికారులు కూడా పాల్గొంటారని సమాచారం.
హోంమంత్రిత్వ శాఖ నుంచి పిలుపు....
రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోంది. ముఖ్యంగా ఏపీలో అవిశ్వాసం ప్రతిపాదన ఊపందుకుంది. టీడీపీ మినహా అన్ని రాజకీయపక్షాలు అవిశ్వాసం పెట్టాల్సిందేనని నిర్ణయించారు. అవిశ్వాసం పెడితే బీజేపీ సర్కార్ కు ప్రమాదం లేకపోయినా... ఈ సందర్భంగా జరిగేచర్చ పార్టీకి డ్యామేజీ చేస్తుందన్న అభిప్రాయంలో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇప్పటికే బీజేపీ అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చలు జరిపింది. మిత్రపక్షమైన టీడీపీతో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేసింది.
అధికారులతోనే సమావేశం.....
అయితే పార్లమెంటు సమావేశాల్లోపే ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు కేంద్ర హోం శాఖ పూనుకుంది. చర్చలకు రావాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించింది. అయితే ఈ చర్చల్లో కేవలం అధికారులే పాల్గొననున్నారు. ప్రధాని గతంలో చేసిన హామీల అమలు, రాష్ట్ర విభజన చట్టంలో అమలు చేసినవి, చేయాల్సిన వంటి అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా మిత్రపక్షమైన టీడీపీ లేవనెత్తుతున్న అభ్యంతరాలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, రెవెన్యూ లోటు, దుగరాజు పట్నం పోర్టు వంటి వాటిపైనే ఎక్కువగాచర్చ జరగనున్నట్లు తెలిసింది. 9,10 షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజనపైనకూడా చర్చించనున్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు, స్టేటస్ రిపోర్ట్ తో రావాలంటూ హోంమంత్రిత్వ శాఖ నుంచి కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ఛీఫ్ సెక్రటరీకి పిలుపు వచ్చింది. మొత్తం మీద ఏపీలో ప్రస్తుతం నెలకొన్న సీన్ కు శుభం కార్డు వేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.