డ్రగ్స్ తీసుకుంది హీరోనా? డైరెక్టరా?

Update: 2017-12-20 02:30 GMT

తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనేకమంది టాలివుడ్ కు చెందిన నటీనటులు, దర్శకులకు నోటీసులిచ్చి విచారణ చేసిన సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. వారి నుంచి రక్త, వెంట్రుక నమూనాలుతీసుకుని పరీక్షలకు పంపారు. అయితే ఈ పరీక్షల్లో ఒకరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. టాలివుడ్ కు చెందిన ఒకరి రక్తంలో మాదకద్రవ్యం అవశేషాలు ఉన్నట్లు పరీక్షలో వెల్లడయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసేందుకు అబ్కారీ శాఖ సిద్ధమయింది. న్యాయస్థానానికి కూడా ఫోరెన్సిక్ నివేదిక చేరింది.

త్వరలో న్యాయస్థానంలో పిటిషన్...

డ్రగ్స్ కుంభకోణంలో అనేక మంది టాలివుడ్ తారలను విచారించారు. పూరి జగన్నాధ్, రవితేజ, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్ తదితరుల రక్త నమూనాలను సేకరించారు. అయితే వీరిలో ఒకరి రక్తంలో మాదకద్రవ్యాల అవశేషాలున్నట్లు పరీక్షల అనంతరం తేలింది. మొత్తం 12 మంది సినీ ప్రముఖులను విచారించారు. వీరిలో ముగ్గురు తమ రక్తం, వెంట్రుకలను పరీక్షలకు ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ఈ విచారణ జరిగిన నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు విన్పిస్తున్న నేపథ్యంలో నివేదికను అధికారులు న్యాయస్థానానికి సమర్పించనున్నారు. ఇంతకీ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న వారిలో ఎవరి రక్త నమూనా నుంచి మాదకద్రవ్యాల అవశేషాలు బయటపడ్డాయన్నది హాట్ టాపిక్ గా మారింది.

Similar News