డీకే అరుణకు లక్కీ ఛాన్స్ తగిలేనా?

Update: 2017-10-15 11:30 GMT

తెలంగాణ పీసీసీ లో మార్పులు తధ్యమనిపిస్తోంది. రాహుల్ గాంధీ పట్టాభిషేకం తర్వాత ఆయన అన్నిరాష్ట్రాల్లో తన సొంత టీంను ఏర్పాటు చేసుకుంటారు. అందులో భాగంగా తెలంగాణ పీసీసీలో కూడా మార్పు తథ్యమని తెలుస్తోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టి రెండేళ్లు దాటి పోయింది. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలన్న యోచనలోనూ అధిష్టానం ఉంది. ప్రస్తుతం సీఎల్పీ, పీసీసీ చీఫ్ పదవి ఒకే జిల్లాకు చెందిన వారు కూడా కావడంతో అధిష్టానం ప్రాంతీయ సమస్యల తలెత్తకుండా వేరే జిల్లా వారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరొందిన గద్వాల్ నాయకురాలు డీకే అరుణకు పీసీసీ పదవి లభిస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పీసీసీ అధ్యక్షుడిని మారిస్తే మహిళలకే ఆ పదవి ఇవ్వాలని రాహుల్ యోచిస్తున్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పదవికి ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి పోటీ పడుతున్నారు. జానారెడ్డికి సౌమ్యుడనే పేరుంది. అధికార పార్టీపై విరుచుకుపడలేక పోవడం ఆయనకు మైనస్ పాయింట్. రెడ్డి సామాజిక వర్గానికే పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలన్నది అధిష్టానం ఆలోచన. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డీకే అరుణ పేరు గాంధీ భవన్ లో విస్తృతంగా విన్పిస్తోంది.

రేసులో డీకే ముందు......

డీకే అరుణ సీనియర్ నేత. కటువుగా మాట్లాడగలరు. సూటిగా హెచ్చరికలూ చేయగలరు. మంచి వాగ్దాటి ఉన్న నేత. కేసీఆర్ సర్కార్ ను ధీటుగా ఎదుర్కొనాలన్నా.... తెలంగాణ ప్రజలకు అధికార పార్టీపై చేసిన విమర్శలు సులువుగా చేరాలన్నా డీకే వంటి నేత అవసరమని కాంగ్రెస్ నేతలు సయితం పరోక్షంగా అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకే చోటు లేదు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవి మహిళకు ఇస్తే తాము ఆ వర్గానికి ఎంత గౌరవమిస్తున్నామో ప్రజలకు తెలుస్తుందన్నది కాంగ్రెస్ వ్యూహం. ఇప్పటికే డీకే యువనేత రాహుల్ తో రెండు, మూడుసార్లు భేటీ అయి వచ్చారు. తనకు అవకాశమిస్తే తానేంటో నిరూపించుకుంటానని కూడా రాహుల్ కుచెప్పి వచ్చారు. అయితే అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత జైపాల్ రెడ్డి డేకే అరుణకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంలో అభ్యంతరం చెప్పే అవకాశమూ లేకపోలేదు. కాంగ్రెస్ లో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు. కాని ఇప్పటి వరకూ అయితే రేసులో మాత్రం డీకే అరుణ ముందున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

Similar News