సీనియర్ నేత డీఎస్ కు గులాబీ బాస్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు. గత పక్షం రోజులుగా డీఎస్ కేసీఆర్ అపాయింట్ మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా దొరకడం లేదట. తాజాగా ఆదివారం కూడా ముఖ్యమంత్రిని కలవాలని డీఎస్ అపాయింట్ మెంట్ కోసం ప్రగతిభవన్ అధికారులను కోరారు. కాని అధికారుల నుంచి నో అనే సమాధానం వచ్చింది. ఇటీవల తనపై జరుగుతున్న ప్రచారం, తన కుటుంబంలో జరిగిన సంఘటనలపై డీఎస్ కేసీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇవ్వాలని భావించారు. అయితే డీఎస్ ను కలిసేందుకే కేసీఆర్ ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ యువజన విభాగం నేతలతో మాట్లాడేందేకు తెలంగాణ భవన్ కు వచ్చారు. వారితో భేటీ అయ్యారు. అయితే ఈసంగతి తెలుసుకున్న డి. శ్రీనివాస్ వెంటనే తెలంగాణ భవన్ కు వచ్చి మీటింగ్ లో ఉన్న సీఎం బయటకు వచ్చిన తర్వాత కలుద్దామనుకున్నారు. దాదాపు మూడు గంటలు డీఎస్ వెయిటింగ్ హాల్లోనే ఉన్నారు. వ్యక్తిగత సిబ్బంది వెళ్లి కేసీఆర్ కు డీఎస్ వెయిట్ చేస్తున్న విషయంచెప్పారు. అయితే ఆయన తెలంగాణ భవన్ లోని తన ఛాంబర్ కు రాకుండా మీటింగ్ నుంచి నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లిపోయారు. దీంతో నిరాశగా డీఎస్ వెనుదిరిగినట్లు తెలిసింది.
దూరంగా టీఆర్ఎస్ నేతలు.....
ఇక టీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ భవన్ కు వచ్చిన డీఎస్ ను పలుకరించే సాహసం చేయలేదట. ఆయనను పలకరిస్తే ఎవరైనా చూసి ముఖ్యమంత్రికి చెబుతారేమోనని భావించి డీఎస్ ను చూసీ చూడనట్లు అటునుంచే వెళ్లిపోయారు. వాస్తవానికి డీఎస్ కేసీఆర్ ను కలవడంలో ముఖ్య కారణం కూడా ఉందని చెబుతున్నారు. తన కుమారుడు పార్టీ మారితే... తనను దూరంగా పెట్టడమేంటన్నది డీఎస్ ప్రశ్న. అంతేకాకుండా ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీలో కూడా తనకు స్థానం కల్పించక పోవడాన్ని డీఎస్ అవమానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్ ఎంత త్వరగా కేసీఆర్ ను కలిసి తను, తన అనుచరుల భవిష్యత్ పై క్లారిటీ తీసుకుందామనుకుంటున్నారు. కాని కేసీఆర్ మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. ఇక డీఎస్ సొంత జిల్లాలో టీఆర్ఎస్ నేతలు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. నిజామాబాద్ అర్బన్, రూరల్ ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలకు కూడా ఆయనకు ఆహ్వానం పంపడం లేదు. మొత్తం మీద డీఎస్ మూడు గంటలు కేసీఆర్ కోసం వెయిట్ చేసినా ఫలితం దక్కలేదు. దీంతో డీఎస్ అనుచరులు తమ భవిష్యత్ ఏంటన్న ఆందోళనలో ఉన్నారు.