ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ఇప్పుడు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగువారందరికీ డాక్టర్ పరకాల సుపరిచితులు . ఆ తరువాత చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో టికెట్లు ప్రకటించే వరకు మెగా స్టార్ కి తలలో నాలుకలా వ్యవహరించారు పరకాల. ప్రజారాజ్యం పార్టీ ఒక విష వృక్షం అంటూ ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మరీ బయటకు వచ్చి సంచలనం సృష్టించారు. ఆ తరువాత ఏపీ విభజనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున రెండు రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెట్టి గుర్తింపు తెచ్చుకున్నారు. విభజన తరువాత ఏపీలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాకా ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ అయి ముఖ్యమంత్రి చంద్రబాబుకి అన్ని తానై వ్యవహరిస్తున్నారు పరకాల. ఇప్పుడు ఆయన విదేశాల్లో చంద్రబాబుకి మరో రకంగా ఉపయోగపడుతున్నారు.
బాబు ఇంటర్వ్యూల రూపశిల్పిగా ...
చంద్రబాబు చైనా , రష్యా , జపాన్ , లండన్ సింగపూర్ ఇలా ఏ దేశంలో అధికారిక పర్యటన చేపట్టినా పక్కన డాక్టర్ గారు వుంటారు. ఉండటమే కాదు అక్కడ చంద్రబాబు ఇంటర్వ్యూలు చేసి పార్టీ అనుకూల మీడియా కి వేగవంతంగా అందించే వ్యవస్థను ఆయనే నడుపుతారు. బాబు ఏదేశంలో వున్నా ఆయన వార్తలన్నీ కో ఆర్డినేట్ చేస్తూ ఏ వార్త ఎలా ఉండాలన్నది ఆయనే నిర్దేశిస్తారు. అభివృధ్ధికోసం చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందన్న అంశాలను తన ప్రశ్నల ద్వారా రాబట్టి టూర్ ప్రయోజనాలను అప్ డేట్ చేస్తూ వుంటారు. ఈ ప్రక్రియ అన్ని అంశాలకన్నా చంద్రబాబు కి బాగా నచ్చిందంటున్నారు పార్టీ వర్గాలు.
పరకాలకు బాబు ఫిదా ...
డాక్టర్ పరకాల ఇచ్చే సలహాలు బాబు ఎంత వరకు తీసుకున్నా లేకపోయినా ఆయన మీడియా కవరేజ్ కి మాత్రం ఫిదా అయ్యారని తెలుస్తుంది . సహజంగా మీడియా మేడ్ సీఎం గా పేరున్న చంద్రబాబుకి అమెరికాలో వున్నా అమరావతి లో వచ్చిన కవరేజ్ వస్తుంటే ఆనందం కాక మరేమిటి. ఇది కాక ఒక 50 మంది కి పైగా జర్నలిస్ట్ లతో సోషల్ మీడియా వ్యవస్థను సైతం ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం కోసం గతంలోనే డాక్టర్ పరకాల నెలకొల్పేశారు. పార్టీకి, ప్రభుత్వానికి బ్యాక్ డోర్ లో సాగే ఈ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది . ఇలా సలహాదారుగా, జర్నలిస్ట్ గా రెండు పాత్రలు సమర్ధవంతంగా పరకాల ప్రభాకర్ పోషించడం విశేషమే.