డబ్బు లేదంటూనే బాబు ఏం చేశారంటే...?

Update: 2017-12-09 11:30 GMT

ఏపీ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. విభ‌జ‌న త‌ర్వాత రాష్ట్రం తీవ్ర క‌ష్ట‌న‌ష్టాలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆర్థిక లోటు అంతా ఇంతా కాదు. నేను బ‌స్సులో ప‌డుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను. కూర్చోడానికి కుర్చీ కూడా లేదు!'' - ఇదీ ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పిన మాట‌.. ఇప్ప‌టికీ చెబుతున్న మాట‌! అయితే, పైకి చెబుతున్న మాట‌ల‌కు ఆయ‌న చేస్తున్న ఖ‌ర్చుల‌కు పొంతన ఉండ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అప్పుల్లోనే ఉంది అనుకున్న‌ప్పుడు బాబు దుబారా చేయ‌డం ఎంత మేర‌కు స‌మంజ‌సం? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన మూడేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు చేసిన ఖ‌ర్చు అంతా ఇంతా కాద‌నేది విప‌క్షం మాట‌.

పోలవరం గురించి....

నిజ‌మే విప‌క్షం కాబ‌ట్టి బాబును టార్గెట్ చేస్తుంద‌ని అనుకున్నా.. స్వ‌ప‌క్షంలోని ఒక‌రిద్ద‌రు కూడా ఇదే ధోర‌ణిలో చెవులు కొరుక్కుంటున్నారు. ఇక‌, ఇప్పుడు పోల‌వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న బాబు దానిని క‌ట్టేందుకు త‌న ద‌గ్గ‌ర డ‌బ్బు లేద‌ని చెబుతున్నారు. అందుకే కేంద్రంపై ఆధార‌పడుతున్నాన‌ని అంటున్నారు. ఇదే నిజ‌మైతే.. పోల‌వ‌రం విష‌యం బాబు చేస్తున్న అతి మాత్రం అంద‌రికీ విస్మ‌యం క‌లిగిస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి ప్ర‌చారాన్ని చంద్ర‌బాబు బాగానే చేసుకున్నారు. 2014లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న చేసిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. ఇటు ప్రింట్ మీడియాలోను, అటు ఎల‌క్ట్రానిక్ మీడియాలోను జ‌ల‌వ‌న‌రుల శాఖ ఊక‌దంపుడు ప్ర‌చారం చేసింది.

పోలవరం ప్రచార ఖర్చు 14 కోట్లు....

చంద్ర‌బాబు పోస్ట‌ర్ల‌తో పోల‌వ‌రం బ్యాగ్రౌండ్‌తో అద‌ర‌గొట్టింది. ఇలా ఒక సారి కాదు, రెండు సార్లు.. మూడేళ్ల‌లో క‌నీసం ముప్పైసార్ల‌యినా ఈ ప్ర‌చారం చేసార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇటీవ‌ల ఇదే విష‌యంపై ఓ స్వ‌చ్ఛంద సంస్థ నిర్వాహ‌కుడు కోరిన ప్ర‌శ్న‌కు ఏపీ పీఅండ్ ఆర్ విభాగం ఇచ్చిన స‌మాధానం సుమారు 14 కోట్ల రూపాయ‌లు పోల‌వ‌రం ప్రాజెక్టు ప్ర‌చారానికి ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసింది. అయితే, ఇది ఒకే సారి చేసిన ప్ర‌చార ఖ‌ర్చు కాద‌ని విడ‌త‌ల వారీగా చేసిన ఖ‌ర్చ‌ని, బ‌డ్జెట్ ప్ర‌ణాళికేత‌ర వ్య‌యం నుంచి దీనిని కేటాయించామ‌ని సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చింది.

Similar News