హిమాచల్ ప్రదేశ్ లో సీఎం ఎవరనేది తేలిపోయింది. కొత్త సీఎంగా జైరాం ఠాకూర్ ను అధిష్టానం ఎంపిక చేసింది. ఈరోజు బీజేపీ నియమించిన పరిశీలకులు నిర్మలాసీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి ఠాకూర్ పేరును ఖరారు చేశారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎక్కువ మంది జైరాం ఠాకూర్ పేరునే చెప్పడంతో ఆయనపేరునే పరిశీలకులు ఖరారు చేశారు.
వివాద రహితుడిగా....
జైరాం ఠాకూర్ వివాద రహితుడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవమూ ఉంది. రాజ్ పుత్ సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో మంత్రిగానూ పనిచేశారు. 2007 నుంచి 2012 వరకూ ఆయన ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ థుమాల్ ను ప్రకటించింది. అయితే ధుమాల్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. దీంతో ధుమాల్ ను సీఎంగా చేయాలని కొందరు ఎమ్మెల్యేలు అడ్డం తిరిగారు. దీంతో బీజేపీ అధిష్టానం కొంత ఇబ్బందిని ఎదుర్కొంది. అయితే ధుమాల్ కు నచ్చజెప్పి ఆయన చేతనే ఠాకూర్ పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదన చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో సీఎం ఎన్నిక సాఫీగా సాగిపోయింది.