ట్రబుల్ షూటర్ దిగారే...

Update: 2017-11-19 08:30 GMT

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ అందుతుందో లేదో తెలియదు. కాని అధికార టీఆర్ఎస్ మాత్రం రాజీనామా లేఖ అందగానే ఆమోదించేయాలన్న యోచనలో ఉంది. అందుకే కొడంగల్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకవేళ రేవంత్ రాజీనామా లేఖ అందిన వెంటనే ఆమోదించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గానికి మంత్రి హరీశ్ రావును ఇన్ ఛార్జిగా నియమించారు. హరీశ్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. హరీశ్ భుజానకెత్తుకుంటే ఏ ఎన్నికల్లో ఓటమి చవి చూడలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగల్ ఉప ఎన్నిక రాకముందే ఆ నియోజకవర్గానికి హరీశ్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. దీంతో హరీశ్ రావు మహబూబ్ నగర్ జిల్లా నేతలతో నిత్యం సమావేశమై కొడంగల్ పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు.

పోటీకి సిద్ధమంటున్న....

మరోవైపు కొడంగల్ ఉప ఎన్నిక జరిగితే తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డి ఉత్సాహంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ గా ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గం మహేందర్ రెడ్డి నియోజకవర్గానికి ఆనుకునే ఉండటంతో అక్కడతో ఆ కుటుంబానికి సత్సంబంధాలున్నాయి. దీంతో నరేందర్ రెడ్డి పోటీకి ఉత్సాహ పడుతున్నారు. అయితే ఆయనకు టిక్కెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. హరీశ్ రావు మాత్రం కొడంగల్ నియోజకవర్గ నేతలు, మహబూబ్ నగర్ జిల్లా నేతలతో నిత్యం మాట్లాడుతూనే ఉన్నారు. రేవంత్ రాజీనామా లేఖ ఇంతవరకూ స్పీకర్ కు చేరలేదు. అయితే ఎప్పుడు చేరితే వెంటనే ఆమోదింప చేసి ఉప ఎన్నికలకు వెళ్లి తన సత్తా చాటాలని అధికార పార్టీ తహతహలాడుతోంది. హరీశ్ ఎంట్రీతో సీన్ మారిపోతుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

Similar News