ట్రంప్ సర్కార్ : ఔట్‌సోర్సింగ్ సంస్థల్లో ఆందోళన

Update: 2016-12-02 18:08 GMT

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు గా ఎన్నికైన ట్రంప్.. త్వరలోనే బాద్యతలు తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో అధికార పీఠం మీదికి వచ్చిన తర్వాత... ఆయన వ్యవహార సరళి ఎలా ఉంటుందనే చర్చోపచర్చలు అమెరికా వర్గాల్లోను, ప్రపంచ వ్యాప్తంగాను కూడా చురుగ్గా సాగుతున్నాయి. పైగా అమెరికా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో తన ఎన్నికల ప్రచార సమయంలో అనేక తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత.. అదే దూకుడును కొనసాగిస్తారా? లేదా, నెమ్మదిస్తారా? అనే చర్చలు కూడా సాగుతున్నాయి.

డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో అవుట్ సోర్సింగ్ కంపెనీల తాట తీస్తా అంటూ హెచ్చరిక ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఉద్యోగాలను ఇతర దేశాల వారికి అప్పనంగా కట్టబెడుతున్న సంస్థల మీద ఆయన ప్రచార సమయంలో ఒక రేంజిలోనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. నిజానికి భారత్ వంటి అనేక దేశాలనుంచి ఉద్యోగులను అవుట్‌సోర్స్ చేస్తుండే సంస్థలను అప్పట్లోనే ఈ ప్రకటనలు డోలాయమానంలో పడేశాయి. అయితే.. ఎన్నికల ప్రచార వేళ లోకల్స్ ను ఆకట్టుకోవడానికి ట్రంప్ ఇలాంటి మాటలు చెబుతుండవచ్చునని అంతా అనుకున్నారు.

తీరా ఇప్పుడు అధికార పగ్గాలు అందుకోవడానికి ట్రంప్ కొద్ది దూరంలో ఉన్న సమయంలో.. ఆయన పాలన మొదలయ్యాక ఇలా అవుట్‌సోర్సింగ్ చేస్తున్న సంస్థలకు కష్టాలు తప్పవని అనుకుంటున్నారు. తాజాగా అమెరికానుంచి తరలిపోవడానికి సిద్ధమైన ఓ కంపెనీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారని, ఆ నిర్ణయాన్ని గమనిస్తే ఆయన వైఖరి తెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.

అమెరికాలోని క్యారియెర్ ఏసీ ల తయారీ సంస్థ తమ యూనిట్ ను మెక్సికో కు తరలించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి వాళ్లు వ్యవహారం ఒక కొలిక్కి తెచ్చేస్తున్న సమయంలో ట్రంప్ ఆ సంస్థకు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 1200 మంది స్థానికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితిని సృష్టించే ఈ తరలింపు వద్దంటూ ట్రంప్ హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో క్యారియెర్ సంస్థ మెక్సికో వెళ్లిపోవాలనే ఆలోచన మానుకున్నట్లు తెలుస్తోంది.

స్వదేశీ ఉద్యోగాల విషయంలో ఇంతే నిక్కచ్చిగా ట్రంప్ వ్యవహరించేట్లయితే అవుట్‌సోర్సింగ్ సంస్థలకు కూడా చిక్కులు తప్పకపోవచ్చుననేది ఒక అనుమానం. ఏది ఏమైనప్పటికీ... జనవరి 20 తరువాత అమెరికా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చునని కూడా ప్రచారం జరుగుతోంది.

Similar News