టీవీల్లో రాణి రాజాలు వారే ....

Update: 2017-12-16 03:30 GMT

వెబ్ దునియా జోరుమీద వుంది. ఫెస్ బుక్ వాట్స్ అప్, యూట్యూబ్, ఇన్స్ స్ట్రా గ్రామ్, ఇలా సామాజిక మాధ్యమాల వేదికలో తమ అభిప్రాయాలను పంచుకోవడం ఫోటోలు వీడియోలు పోస్ట్ చేసుకోవడం అందులోనే అనేక అంశాలపై చర్చించుకోవడం నిరంతరం నిత్య కార్యక్రమం అయ్యింది. టివి పెట్టుకుని ఇంటిల్లిపాది సినిమాలు, న్యూస్ , ఎంటర్ టైన్మెంట్ చూసే రోజులు పోయాయి. ఎవరి మొబైల్ వారు ఆన్ చేసుకుని వారి వారి అభిరుచులకు అనుగుణంగా వినోదించేస్తున్నారు. దాంతో రేటింగ్స్ లేక ఛానెల్స్ ఘొల్లు మంటున్నాయి. ఏదో ఒక చర్చ పెట్టి రచ్చ చెయ్యిందే ఏ ఛానెల్ ఎవరూ చూసే పరిస్థితి లేదు. ఒక సినీ సెలబ్రెటీ అయివుండొ, లేక కులమో మతమో ప్రాంతమో వివాదాస్పదం అయితే ఛానెల్స్ కి పండగ, లేదా సినీ ఫంక్షన్స్, రేటింగ్ రప్పిస్తున్నాయి. రోజుకో వివాదం నడపందే రేటింగ్ రాదు కనుక ఛానెల్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ చేసే వారిని ఏరికోరి కెలుకుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒక ఛానెల్ కి మరో ఛానెల్ పోటీలు పడుతున్నాయి.

రేటింగ్ రాణి రోజా, రాజా పోసాని , తాజాగా కత్తి మహేష్ ...

సినీ పొలిటికల్ గ్లామర్ తార కావడం ఎవరినైనా దుమ్ము దులిపేయడం వంటి అడ్వాంటేజెస్ ఉన్న నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజా ఛానెల్స్ లో చర్చలో పాల్గొన్నా లేక ఫోన్ ఇన్ లో వున్నా ఆ ఛానెల్ కి రేటింగ్ దూసుకుపోతుంది. ఇక రచయితా నటుడు పోసాని కృష్ణ మురళి సైతం ఇటీవల రేటింగ్ స్టార్ రాజా లా దూసుకుపోతున్నారు. తనదైన శైలిలో పోసాని కృష్ణ మురళి హావభావాలతో చెప్పడంతో ఆయన అన్ని వర్గాల ఆడియెన్స్ కు కనెక్ట్ అయి కామెడీ పండిస్తున్నారు. అలాగే ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా మాటలు తూటాల్లా పేల్చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ అంటే ఒంటి కాలిపై లేచే కత్తి మహేష్ కి సైతం రేటింగ్ అదిరిపోతూ ఉండటంతో ఆయనకు అన్ని ఛానెల్స్ రండి బాబు రండి అని రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. కత్తి మహేష్ కి పవన్ రేంజ్ లేకపోయినా విమర్శలు పదునుగా చేయడం, నిర్భయంగా అవతలివారిపై డబ్బాల కొద్ది తారు పోస్తే చాలని ఆయా చర్చల్లో వివాదాలు రోజుల తరబడి సీరియల్ గా నడుస్తాయని ఆ లాజిక్ తో ఛానెల్స్ ముందుకు పోతున్నాయి. ఈ స్టార్స్ కి తోడు ఏ చిన్న సెలబ్రిటీ పొరపాటున పోయాడా నట్టింట్లో ఆ శవాన్ని పెట్టి అంత్యక్రియల వరకు లైవ్ లు మీద లైవ్ లు రేటింగ్స్ కోసం నడిపిస్తున్నారు. ఇక నెట్ ఇంట్లో కూడా వాటినే తిలకిస్తున్నారు నెటిజెన్లు.

పక్కదారి పడుతున్న ప్రజా సమస్యలు ....

వాస్తవానికి తెలంగాణ ఏపీలో అనేక ప్రజా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ముఖ్యంగా విభజన తో నష్టపోయిన ఏపీలో పోలవరం, అమరావతి కేంద్రంగానూ ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టే అనేక కీలక అంశాలు వున్నాయి. లక్షా ఇరవైవేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఏపీ సర్కార్ కొట్టుమిట్టాడుతోంది. అయితే వీటిమీద చర్చలు జరిపినా ప్రజలకు ఉపయోగపడే వీటికి మాత్రం రేటింగ్స్ పడిపోతున్నాయి.అందుకే ప్రధాన సమస్యలపై రాష్ట్రంలో ఎవరో సెలబ్రిటీ మాట్లాడితే తప్ప న్యూస్ ఛానెల్స్ పట్టించుకునే తీరిక లేదు. ఒక వేళ సీరియస్ గా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టె మంచి కార్యక్రమాలను న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేసినా రేటింగ్ లేని పరిస్థితి. దాంతో జనం చూస్తున్నారు కాబట్టి మేం చుపిస్తున్నామనే ధోరణి ప్రస్తుతం ట్రెండ్ గా నడుస్తుంది. ఈ ట్రెండ్ ఎప్పటికి మారుతుందా అని చాలామంది ఎదురుచూస్తున్నా మరింత పెరిగేలాగే కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

Similar News