రాయలసీమలో సీనియర్ నేత ఇప్పుడు టీడీపీలోకి వస్తున్నట్లు సమాచారం. జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ సీనియర్ నేతను పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఆ పార్టీ సీనియర్ నేత సీఎం రమేష్ సీనియర్ నేతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాయలసీమలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకంగా ఉన్న నేత మైసూరారెడ్డి. మైసూరారెడ్డి అనేక పదవులు నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే మైసూరా తర్వాత వైసీపీలో చేరిపోయారు. కొన్నాళ్లు మైసూరా వైసీపీలోనే కొనసాగినా గత ఏడాది ఏప్రిల్ నెలలో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. జగన్ కు తన రాజీనామాను ఈమెయిల్ చేశారు. తన సలహాలను జగన్ పాటించడం లేదని, పార్టీలో స్వార్థం పెరిగిపోయిందని, ప్రజా సమస్యలు పట్టడం లేదని మైసూరారెడ్డి అప్పట్లో జగన్ కు నాలుగు పేజీల లేఖ రాయడం సంచలనం కలిగించింది. తర్వాత మైసూరారెడ్డి ఏ పార్టీలోనూ చేరలేదు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే జగన్ సొంత జిల్లాలో దెబ్బకొట్టాలంటే మైసూరారెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అతి త్వరలోనే చేరికకు.....
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి అనేకసందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. అప్పట్లో ‘బిగ్ బాస్’ కుంభకోణాన్ని కూడా మైసూరాయే బయటపెట్టారు. ఏ విషయాన్నైనా సమగ్రంగా అధ్యయనం చేసి... ఉదాహరణలు... సాక్ష్యాలతో అవతలివారిని ఇరుకున పెట్టడం మైసూరాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి మైసూరాను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు టీడీపీ ప్రారంభించింది. మైసూరాకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీకి గనుల కేటాయింపు విషయంలోనూ టీడీపీ సర్కార్ కొంత ఫేవర్ చేసిందని చెబుతున్నారు. మైసూరా కూడా టీడీపీలో చేరేందుకు ఉత్సాహంగానే ఉన్నారు. తనకు రాజ్యసభ పదవి ఇవ్వాలని మైసూరా కోరుతున్నట్లు సమాచారం. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మైసూరా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సంకేతాలు ఇప్పటికే కడప జిల్లా టీడీపీ నేతలకు అందినట్లు తెలిసింది. అయితే ఇదే మైసూరాను గతంలో తెలుగుదేశం నుంచి బహిష్కరించారు. ఇప్పుడు మళ్లీ చేర్చుకుంటున్నారు. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ ను సొంత జిల్లాలో దెబ్బకొట్టేందుకు చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.