అధికార పార్టీలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. నియోజకవర్గంలో నానాటికీ తగ్గిపోతున్న ప్రాధాన్యతను నిలుపుకోవడానికి ఎమ్మెల్యే ఆరాటపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని జిల్లాల్లో ఇరిగేషన్ సబ్ డివిజన్లను విభజిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుచ్చిరెడ్డిపాలెం ఇరిగేషన్ సబ్ డివిజన్‌ను రెండుగా విభజించారు. ఇక్కడే మంత్రి సోమిరెడ్డి, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి మధ్య వివాదం చెలరేగింది. తొలుత అన్ని నిర్ణయాలకు అంగీకరిం చిన ఎమ్మెల్యే.. చివరకు ప్లేటు ఫిరాయించడంతో వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. అధికార పార్టీలో ఆధిపత్య ప్రభావం కెనాల్ సబ్‌డివిజన్ పునర్విభజనపై పడటంతో గందరగోళం మొదలైంది.
కొత్త డివిజన్ ఏర్పడటంతో...
ఆత్మకూరును కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేసే సమయంలోనే ఇరిగేషన్ కొత్త డివిజన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. దీని ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త డివిజన్ ఏర్పాటుకు, పాత డివిజన్‌లోని మార్పులు, చేర్పులకు జీఓ విడుదల చేశారు. జీఓను అనుసరించి బుచ్చిరెడ్డిపాళెం డివిజన్‌ను విడదీయాల్సి వచ్చింది. ఇప్పుడు నీటి పంపకాలు, వాటాల విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్ సబ్ డివిజన్‌ను రెండు సబ్ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది.
కోకో కోలా కంపెనీకి....
సబ్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణమై తొలుత కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రి సోమిరెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ సబ్ డివిజన్‌లో ఉండే కొడవలూరు, విడవలూరు మండలాలను కోవూరు మండలంలో కలిపారు. కొడవలూరు మండలంలోని ఇఫ్కోకు కనిగిరి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీ నీటిని కేటాయించారు. కోకో కోలా సంస్థకు 8 నుంచి 9 టీఎంసీల నీటిని విక్రయించ డానికి వీలుగా ఒప్పందాలు చేశారు. దీనివల్ల కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్న 1.48 లక్షల ఎకరాల భూమిలో సాగుకు విఘాతం కలుగుతుందనేది రైతు సంఘాల వాదన.
అడ్డం తిరిగిన పోలంరెడ్డి....
విభజనకు మంత్రి సోమిరెడ్డి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ అంగీకరించారు. పునర్విభజనకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మొదట అంగీకరించినా.. అడ్డం తిరిగారు. పార్టీలో తగ్గిపోతున్న ప్రాభవాన్ని పెంచుకోవడం కోసమే రైతు ప్రయోజనాలంటూ ఎమ్మెల్యే హడావుడి చేస్తున్నారనేది పార్టీలో ఒక వర్గం వాదన. సబ్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పోలంరెడ్డి భారీగా కాంట్రాక్టులు నిర్వహించడం, గతంలో తనకు అనుకూలంగా ఉండే ఏఈలను, డీఈలను నియమిం చు కోవడం చేశారు. మరోవైపు డివిజన్‌లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా కొంత పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని ఎమ్మెల్సీ, మంత్రులు పట్టించుకోకపోవడం, ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తిరుగుబావుటా ఎగరవేశారు.
సీఎం చెంతకు వివాదం...
గతంలో నియోజకవర్గంలోని ఇఫ్కో, కిసాన్ సెజ్‌లకు అనుమతి ఇచ్చే విషయంలో ఆయన నోరు మెదపలేదు. పెన్నా డెల్టా రైతులకు రావాల్సిన నీరు తెలుగుగంగకు పంపిణీ చేస్తున్నా ఒక్క మాట కూడా అడగలేదు. దీనికితోడు నీరు–చెట్టు పనుల్లో కోవూరు నియోజకవర్గంలో జరిగినంత అవినీతి మరే నియోజకవర్గంలో జరగలేదు. తరచూ వివాదాలు వస్తున్న ఈ డివిజన్‌లో అధికారులను ఆయనే వెనకేసుకొచ్చిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లింది. మరి వీరి మధ్య మొదలైన వివాదం.. ఎప్పుడు పరిష్కారమవుతుందో వేచిచూడాల్సిందే!!