ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ మిత్రపక్షాల్లో ఆనందాన్ని నింపాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా శివసేన, టీడీపీ లాంటి మిత్రులు ఈ ఫలితాలతో తెగ సంబరపడిపోతున్నారు. వరుస విజయాలు వస్తున్న కొద్దీ ప్రధాని మోడీని పట్టుకోలేకపోతున్నామని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, మిత్రులను దూరంగా పెట్టడం వంటివి చేస్తున్నారని వారు నేరుగానే చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని పుల్ పూర్, గొరఖ్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ వెనుకంజలో ఉండటంతో పార్లమెంటు ఆవరణంలో పెద్దయెత్తున చర్చజరిగింది.
యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై...
శివసేన నేత సంజయ్ రావత్ మోడీకి ఈ ఫలితాలు చెంపపెట్టులాంటివని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం.శ్రీరాముడిని అవమానించిన ఎస్పీనేతను రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానించినప్పుడే దేవుడు మీ నుంచి ముఖం తిప్పుకున్నారని సంజయ్ రావత్ అన్నారు. శివసేన బయటపడింది కాని టీడీపీ లోలోపల ఆనంద పడుతోంది. ఇక గత ఎనిమిది రోజుల నుంచి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై పార్లమెంటు వెలుపల, బయట ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సభను వాయిదా వేస్తూ వెళుతున్నారు తప్ప దిగి రావడం లేదు. అంతేకాదు విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వమని తేల్చి చెప్పేశారు. మిత్రపక్షంగా ఉన్న తమకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వైసీపీ ఎంపీలను కలవడంపై టీడీపీ ఎంపీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
మోడీ ఇప్పటికైనా మారతారా?
ఈనేపథ్యంలో యూపీ ఉపఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎంపీల్లోనూ పెద్దయెత్తున చర్చ జరిగింది. వచ్చే లోక్ సభ ఎన్నికలకు ఇది సంకేతాలని వ్యాఖ్యానించడం కూడా విన్పించింది. బహిరంగంగా ఈ ఫలితాలపై వ్యాఖ్యానించనప్పటికీ అంతర్గత సంభాషణల్లో మాత్రం బీజేపీ వెనుకంజలో ఉండటం పై వారు సంతోష పడుతున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, ఏపీని అనాధను చేసిందని వారు ఆరోపిస్తున్నారు. మోడీ ఇప్పటి వరకూ విజయయాత్రలే చూశారని, యూపీ ఉప ఎన్నికల తర్వాతైనా మోడీలో మార్పు వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక అమరావతిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు యూపీ ఎన్నికల ఫలితాలపై సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద యూపీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీలో అంతర్గతంగా సంతోషాన్ని నింపాయి.