బీజేపీ నేతలు స్వరం పెంచుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నేతలు టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడటం చర్చనీయాంశంగా మారింది. వరుసగా బీజేపీ నేతలు టీడీపీనే టార్గెట్ చేసుకున్నట్లు కన్పిస్తోంది. టీడీపీ సర్కార్ చేయలేని...చేయలేకపోయిన పనులకు కేంద్రానిదే బాధ్యతని చెబుతుండటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినందునే బీజేపీ నేతలు వాయిస్ పెంచుతున్నారన్నది ఆ పార్టీ నుంచి విన్పిస్తున్న మాట.
టీడీపీ విధానాలను తప్పుపడుతున్న....
ఏపీ బీజేపీలో రెండు వర్గాలున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్న నేతలు టీడీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. సంఘ్ పరివార్ కూడా టీడీపీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. అంతర్గత సమావేశాల్లోనూ ఈవిషయం చర్చికు వచ్చినప్పుడు సంఘ్ పరివార్ టీడీపీ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో్నే సోము వీర్రాజు గతంలో ఎన్నడూ లేని విధంగా విమర్శలకు దిగుతున్నారు.
తాజాగా ఎమ్మెల్సీ మాధవ్....
నిన్నమొన్నటి దాకా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కు జతగా మరో ఎమ్మెల్సీ కలిశారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. పోలవరం, రాజధాని నిర్మాణం దేవుడి పై భారమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో చంద్రన్నకానుకల పేరిట దోపిడీ జరుగుతుందన్నారు. కానుకల్లో నాణ్యత లేదన్నారు. విజయవాడలో కూలగొట్టిన దేవాలయాల సంగతేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన మండి పడ్డారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మాధవ్ స్వరం పెంచడానికి వెనక కూడా ఆర్ఎస్ఎస్ కారణమని తెలుస్తోంది. సంక్షేమ పథకాలను కేవలం పచ్చ చొక్కాలకే అందుతున్నాయన్నది బీజేపీ నేతల ప్రధాన ఆరోపణ. నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన బీజేపీ క్యాడర్ ను పట్టించుకోక పోవడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. దీంతోనే బీజేపీ టీడీపీతో తెగతెంపులకు సిద్ధమైనట్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొత్తం మీద బీజేపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ నేతలు ఉన్నారన్నది వాస్తవం.