టీడీపీపై ఆ ప‌త్రిక శివాలెత్తిందిగా

Update: 2018-03-21 06:30 GMT

శివసేన అధికార పత్రిక సామ్నా తన సంపాదకీయంలో టీడీపీ, బీజేపీలను కడిగిపారేసింది. కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూనే టీడీపీపై సెటైర్లు విసిరింది. ఈ రెండు పార్టీలకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలపై పట్టింపులేదనీ.. రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమంటూ పరోక్షంగా చురుకలు వేసింది. పూర్తి మెజారిటీ ఉన్న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఒక వ్యర్థ ప్రయత్నంగా పేర్కొంది.

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే....

చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వంపై నిజంగానే ఆగ్రహం ఉంటే ఉంటే ముఖ్యమంత్రి పదవిని త్యజించి వైసీపీ అధినేత జగన్ తో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయాలని సూచించింది. మరో అడుగు ముందుకు వేసి... కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం కోసం టీడీపీ, వైసీపీలు పోటీ పడడం బీజేపీకి వినోదం కలిగిస్తోందంటూ చురకలు వేసింది. శివసేన అధికార పత్రిక సంపాదకీయం టీడీపీ, వైసీపీలు కలిసి బీజేపీపై పోరాడాలని సూచించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

బీహార్ లాగానే ఏపీలో కూడా....

ఈ రెండు పార్టీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్న విషయాన్ని ఏపీ ప్రజలకు సామ్నా పరోక్షంగా చెప్పింది. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవహార శైలిని కూడా సంపాదకీయంలో దుయ్యబట్టింది. అంతేకాకుండా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఒకేలా ఉందని పేర్కొంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఇచ్చిన హమీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదనీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ మోడీ అదే చేశారని సామ్నా విమర్శలు గుప్పించడం గమనార్హం.

జాతీయ ప్రయోజనాలేవీ లేవంటూ....

అవిశ్వాస తీర్మానాల విషయంలో మరో ముఖ్యమైన కామెంట్స్ కూడా సామ్నా చేసింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల వల్లే టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చూస్తోందని, అందులో జాతీయ ప్రయోజనాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో అన్ని చుట్టుముడుతున్న ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబుకు శివసేన అధికార పత్రిక సంపాదకీయంతో పెనంమీద నుంచి పొయ్యిలో పడినట్లు అయిందని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు.

Similar News