తెలంగాణలో టీడీపీని పూర్తిగా ఖాళీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. కేవలం నేతలను చేర్చుకోవడంతోనే కేసీఆర్ ఆగడం లేదు. లీడర్లు ఎటు అధికారంలో ఉంటే అటు వైపు వస్తారని కేసీఆర్ కు తెలియంది కాదు. కాని ఓటు బ్యాంకును తెచ్చుకోవడమే అసలైన పరీక్ష. ఇందుకోసం కేసీఆర్ టీడీపీకి తెలంగాణలో బలంగా ఉన్న ఓటు బ్యాంకుపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మొన్నటి ఎన్నికల వరకూ ఉన్న ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు కేసీఆర్ ప్రణాళికలను రచిస్తున్నారు. తెలంగాణలో టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు బీసీ ఓటర్లే. వీరిలో ముఖ్యంగా ముదిరాజ్, గొల్ల, కుర్మలు, గౌడ, చేనేత వర్గాలు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఈ కులాలపై దృష్టి పెట్టారు. ముఖ్యమైన కుల సంఘాలకు హైదరాబాద్ లో ప్రభుత్వ ఖర్చుతో సంక్షేమ భవనాలను నిర్మించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.
టీడీపీ ఓటు బ్యాంకుపై కేసీఆర్ కన్ను....
ఇప్పటికే రాష్ట్రంలో ఏడు లక్షలమంది గొల్ల, కుర్మలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. ముదిరాజ్ లకు, గంగపుత్రులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. చేనేతలకు ఉచితంగా నూలు, రసాయనాలను ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. వీటితో పాటు డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలోనూ వీరికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇంతటితో ఆగకుండా ప్రతి కులానికి హైదరాబాద్ లో సంక్షేమ భవానాన్ని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయించారు. గొల్ల కుర్మలకు హైదరాబాద్ లో ఐదు ఎకరాలస్థలాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాకుండా బుద్వేల్ లో గొల్ల, కుర్మ సంక్షేమ భవనం, హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద యెత్తున ఖర్చు చేయనుంది. దీనికి డిసెంబర్ నెలలో కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది మార్చి నెలలో గొల్ల కుర్మల భారీ బహిరంగ సభ టీఆర్ఎస్ ఏర్పాటు చేయనుంది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముంది. అలాగే ముదిరాజ్, గంగపుత్రుల సభలను కూడా ఏర్పాటు చేయాలని కేసీఆర్ పార్టీ వర్గాలను ఆదేశించారట. మొత్తం మీద టీడీపీ ఓటు బ్యాంకును పూర్తిగా కొల్లగొట్టేయాలన్నదే కేసీఆర్ ప్లాన్ గా ఉంది. టీడీపీకి ఇక తెలంగాణలో కష్టకాలమేనని చెప్పక తప్పదు.