టీడీపీతో పొత్తు లేన‌ట్టే.. అన్ని సీట్ల‌లో పోటీ...!

Update: 2018-02-02 09:30 GMT

ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు నేతృత్వం వ‌హిస్తోన్న బీజేపీ బంధంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఆరేడు నెల‌లుగా వ‌చ్చే ఎన్నిక‌ల వేళ టీడీపీ - బీజేపీ బంధం విచ్ఛిన్న‌మ‌వుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకు బీజేపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతుండ‌డం కూడా ఆ ప్ర‌చారానికి ఊత‌మిచ్చిన‌ట్ల‌య్యింది. ఇక తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి అన్నింటా అన్యాయం జ‌రిగిన నేప‌థ్యంలో ఏపీ జ‌నాలు బీజేపీ అంటేనే తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

ఏపీలో మాత్రం....

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ఏ పార్టీ అయినా బీజేపీతో వెళితే బీజేపీతో పాటు ఆ పార్టీ కూడా నిండా మున‌గ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ‌లు కూడా ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి. ఏపీ ఎంపీలు కొంద‌రు బీజేపీతో తెగ‌తెంపులు చేసుకోవాల‌ని పార్టీ అధినేత చంద్ర‌బాబుపై ఒత్తిడి చేస్తున్న‌ట్టు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక నిన్న బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాక కొంద‌రు టీడీపీ ఎంపీలు దీనిపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ‌, ఏపీ బీజేపీ అధ్య‌క్షులు, నేత‌లు కొంద‌రు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా చేసిన వ్యాఖ్య‌లు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఏపీలో కొంద‌రు పార్టీ నేత‌లు టీడీపీతో పొత్తు వ‌ద్ద‌ని చెపుతుంటే ఆయ‌న మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆ పార్టీతోనే పొత్తు ఉంటుంద‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మిత్ర‌ధ‌ర్మానికి ఇబ్బంది క‌లిగించేలా మాట్లాడే పార్టీ నేత‌ల‌పై చ‌ర్య‌లు కూడా తీసుకోవాల‌ని సైతం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు సూచించిన‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణలో ఒంటరిగానే....

ఏపీ విష‌యంలో పొత్తు ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చిన షా తెలంగాణ విష‌యంలో మాత్రం టీడీపీతో పొత్తు లేద‌ని చెప్పేశారు. తెలంగాణ‌లో టీడీపీతోనే కాదు ఏ పార్టీతోనూ పొత్తు ఉండ‌ద‌ని చెప్పిన షా మొత్తం 119 సీట్ల‌లోనూ పోటీకి సిద్ధం కావాల‌ని చెప్పార‌ట‌. తెలంగాణ‌లో పార్టీ ప‌రిస్థితి అంచ‌నా వేసేందుకు తాను త్వ‌ర‌లోనే అక్క‌డ ప‌ర్య‌టిస్తాన‌ని కూడా షా వాళ్ల‌కు చెప్పిన‌ట్టు టాక్‌. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్‌, కిష‌న్‌రెడ్డికి షా ఈ ఆదేశాలు జారీ చేసిన‌ట్టు స‌మాచారం.

సీట్ల పెంపు విషయంపై మాత్రం....

ఇక అసెంబ్లీ సీట్ల పెంపుపై తెలుగు రాష్ట్రాల రాజ‌కీయ నాయ‌కులు, పార్టీలు ఎన్నో ఆశ‌ల‌తో ఉండ‌గా షా మాత్రం ఈ విష‌య‌మై నోరు మెద‌ప‌లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా బీజేపీ - టీడీపీ ఏపీలో మిత్రులుగాను, తెలంగాణ‌లో శ‌త్రువులుగాను కంటిన్యూ అవుతుందా ? ఈ వింత పొత్తుతో ఈ రెండు పార్టీలు ఎలాంటి రాజ‌కీయం చేస్తాయో ? విచిత్రంగానే ఉంది.

Similar News