తండ్రి రూపంలోనే కాదు.. రాజకీయ చతురత, మాటతీరును కూడా అందిపుచ్చుకున్నారు నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ ఎంపీ కేసీఆర్ తనయ కవిత. మాటతీరులో పార్లమెంటులోనూ తన కంటూ గుర్తింపు తెచ్చుకుని తండ్రి తగ్గ తనయ అనిపించుకుంటూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి కేసీఆర్.. ఆపరేషన్ ఆకర్ష్ అంటూ టీడీపీలో ఉన్న నేతలను అందరినీ కారులో ఎక్కించేసుకుంటే ఇప్పుడు.. అక్కడక్కడా జిల్లాల్లో ఉన్న సీనియర్ నాయకులపై కవిత దృష్టిపెట్టారు. ముఖ్యంగా ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌లో మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు మండవ వెంకటేశ్వరరావు కారెక్కించే ప్రయత్నాల్లో ఆమె సఫలీకృతులయ్యారనే చర్చ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో....
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మాట విని చాలా రోజులే అయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రాజకీయ పునరేకీకరణ పేరుతో భారీగా వలసలను ప్రోత్సహించింది. ఈ దెబ్బకు టీడీపీలో చాలామంది నాయకులే గులాబీ కండువా కప్పేసుకున్నారు. అక్కడక్కడా కొంతమంది ఉన్నా వారు కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇటువంటి వారిపై టీఆర్ఎస్ గురిపెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీరితో చర్చలు జరుపుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్దన్న పాత్ర పోషించిన డీఎస్ కారెక్కిన వెంటనే క్యాబినెట్ పదవిని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా నేతల చూపు టీఆర్ఎస్ వైపు మళ్లిందని అంటున్నారు.
మండవ కారెక్కడం ఖాయమైందా?
సీనియర్ నాయకుడు - టీడీపీకి చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా కారెక్కుతారన్న ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ జిల్లా ఎంపీగా ఉన్న సీఎం కేసీఆర్ కూతురు కవిత ఈ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది. జిల్లాలో కీలకమైన రెడ్డి - కమ్మ సామాజికవర్గాలను టీఆర్ ఎస్ పార్టీలో మరింత బలోపేతం చేసే దిశగా ఆమె సమాలోచనలు చేస్తున్నట్లు చెప్తున్నారు. తెలంగాణలో బతికి బట్టలేని టీడీపీలో ఉండటం ఎందుకని మండవను కారెక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రాథమిక చర్చలు కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నాయకుడిగా పేరున్న మండవ వెంకటేశ్వర్ రావు మంచి వ్యూహకర్తగా పేరుంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు.
మండవతో మంతనాలు....
గతంలో ఒంటిచేత్తో జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించిన ఘనత ఆయన సొంతం. 2014 ఎన్నికల తర్వాత ఆయన రాజకీయంగా క్రియాశీలంగా లేరు. అప్పటి నుంచి ఏ రాజకీయ కార్యక్రమాల్లోనూ పాల్గొనటం లేదు. ఇప్పటికే జిల్లాపై సంస్థాగతంగా పట్టుసాధించిన టీఆర్ ఎస్ రాబోయే ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి ఎదురు లేకుండా చూసుకునేందుకుగానూ మండవపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సంక్రాంతి పండగ తర్వాత మండవ చేరిక ఉంటుందని.. టీఆర్ ఎస్ పార్టీ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. మొత్తానికి రాజకీయ వ్యూహాల్లో తండ్రికి తగ్గ తనయగా కవిత నిరూపించుకునేందుకు ఇదే సరైన అవకాశం మరి!!