టీడీపీకి ప‌వ‌న్ షాక్‌.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో జ‌న‌సేనాని

Update: 2017-12-09 07:36 GMT

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ త‌న ఏపీ ప‌ర్య‌ట‌న‌లో సీఎం చంద్ర‌బాబును స‌మ‌ర్ధిస్తూనే.. ప‌రోక్షంగా ఊహించని షాక్ ఇచ్చాడు. 2014లో టీడీపీకి అనుకూలం వ్య‌వ‌హ‌రించి, ప్ర‌చారం చేసి పెట్టిన ప‌వ‌న్‌.. ఆ త‌ర్వాత రాష్ట్రంలో ఏదేమైనా.. బాబును మాత్రం స‌మ‌ర్ధించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. అయితే, ఏపీ ప‌ర్య‌ట‌న‌లో అటు విశాఖ‌లో ప్రారంభించిన త‌న యాత్రలో ప‌వ‌న్‌.. పోల‌వ‌రం ప్రాజెక్ట‌ను సంద‌ర్శించారు. అక్క‌డి ప‌నులు అయిన అనంత‌రం ఫాతిమా కాలేజీ విద్యార్థుల‌తో భేటీ అయ్యారు. సో.. ఇంత‌టితో ప‌వ‌న్ షెడ్యూల్ అయిపోయింద‌ని భావించిన త‌రుణంలో ఊహించ‌ని విధంగా ప‌వ‌న్ టీడీపీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి ఇంటికి స్వ‌యంగా వెళ్లి.. అంద‌రినీ నిశ్చేష్టుల‌ను చేశాడు.

బడేటి బుజ్జి ఇంటికి వెళ్లి...

ప‌శ్చిమ‌గోదావ‌రి జ‌ల్లా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఇంటికి ప‌వ‌న్ వెళ్ల‌డం పలవురిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు...జనసేన పార్టీ శ్రేణులను కూడా షాక్‌కు గురిచేసింది. ఇటీవలే వివాహం జరిగిన ఎమ్మెల్యే బుజ్జి తనయ లక్ష్మీహాస, అల్లుడు మనోజ్ కు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నేతలతో పవన్ ఈ తరహా సంబంధాలు నెరపడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా....టీడీపీకి - పవన్ కు ఉన్న దోస్తీకి ఇదే నిదర్శనమని ఆయన విమర్శకులు అంటున్నారు.

గతంలో ప్రజారాజ్యంలోనూ...

కాగా ఈ పరిణామం వెనుక మరో వార్త వినిపిస్తోంది. బడేటి బుజ్జి దివంగత విఖ్యాత నటుడు ఎస్వీ రంగారావు మనవడు అని తెలుస్తోంది. ఎస్వీ రంగారావుకు - మెగాస్టార్ ఫ్యామిలీకి సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెళ్లి ఉంటారని అంటున్నారు. మరోవైపు జనసేన సెక్రటరీ రాఘవయ్య ఇంటికి పవన్ వెళ్లగా ఎమ్మెల్యే బుజ్జి అల్లుడు రాఘవయ్య మేనల్లుడేన‌ని స‌మాచారం. ఈ క్రమంలో వారు భేటీ అయ్యారని అంటున్నారు. ఏదిఏమైనా...ఈ పరిణామం జనసేన పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది. ఇక‌, బుజ్జి గ‌తంలో చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలోనూ ఉన్నారు. ఆత‌ర్వాత పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అయిన నేప‌థ్యంలో టీడీపీలో చేరిన బుజ్జి ఎమ్మెల్యే సీటు సంపాయించి విజ‌యం సాధించాడు. కాగా, రాబోయే రోజుల్లో ప‌వ‌న్ పిలుపు నిస్తే.. జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశం కూడా ఉంటుంద‌ని బుజ్జి స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.

Similar News