టీడీపీకి అచ్చిరాని చోట జగన్..?

Update: 2018-02-10 01:30 GMT

రెండు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ నేటి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. జగన్ ప్రజాసంకల్ప యాత్ర నేటికి 83వ రోజుకు చేరుకుంది. ఆయన కావలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపికి మంచి పట్టుంది. టీడీపీకి ఈ నియోజకవర్గం పెద్దగా అచ్చిరాలేదు. ఎప్పుడూ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులో, కాంగ్రెస్ పార్టీ యో గెలుస్తూవస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గలో జగన్ పాదయాత్ర జరుగుతుండటంతో ఆ పార్టీలో ఉన్న విభేదాలను తొలుత జగన్ పరిష్కరించాల్సి ఉంటుంది.

ఇక్కడ టీడీపీకి విజయాలు తక్కువే....

కావలి నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలిస్తే 1983లో స్వంతంత్ర అభ్యర్థి పి.వెంగళరావు విజయం సాధించారు. ఆ తర్వాత 1985, 1989, 1994లో కాంగ్రెస్ అభ్యర్థి కలికి యానాదిరెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. ఎన్టీఆర్ హవా కూడా ఇక్కడ పనిచేయలేదు. అయితే 1999లో మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంటేరు వేణుగోపాల్ రెడ్డి గెలుపొందారు. 2004లో తిరిగి ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక్కడ ఆ ఎన్నికల్లో మాగుంట పార్వతమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. 2009లో తిరిగి టీడీపీ ఇక్కడ విజయం సాధించింది. బీద మస్తాన్ రావు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థి బీద మస్తాన్ రావుపై ఐదు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

వైసీపీలో గ్రూపుల గోల...

కావలి నియోజకవర్గంలో టీడీపీకి పెద్దగా విజయాల రికార్డు లేకపోవడంతో జగన్ పాదయాత్ర ఇక్కడ విజయవంతంగా జరుగుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు కావలి నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా మరో బలమైన గ్రూపులు తయారయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్థన్ రెడ్డి టిక్కెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా మరొకరు తిరుగుబాటు చేయని పరిస్థితి. ఈనేపథ్యంలో జగన్ వీరి మధ్య ఎలాంటి సఖ్యతను తీసుకొస్తారోనన్న ఆసక్తి పార్టీ శ్రేణుల్లోనూ నెలకొంది.

నేటి పాదయాత్ర షెడ్యూల్.....

వైఎస్ జగన్ శనివారం ఉదయం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో దగదర్తి నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దుండిగమ్, ఇత్తంపాడు క్రాస్ రోడ్స్, మునుబోలుపాడు వరకూ యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం అక్కడి నుంచి ప్రారంభమైన పాదయాత్ర లింగాలపాడు, బోడగుదపాడు వరకూ సాగుతుంది. బోడగుదపాడులో బహిరంగసభను పార్టీ శ్రేణులు ఏర్పాటు ేశఆయి. దగదర్తిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు. కావలి నియోజకవర్గంలో జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి.

Similar News