టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ మృతి

Update: 2018-02-07 01:50 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు కన్ను మూశారు. మంగళవారం అర్థరాత్రి ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో ఆయన మృతిచెందారు. ఆయన తిరుపతిలోని పద్మావతిపురంలో నివాసముంటున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ పిలుపుతో వచ్చారు.

ఆరుసార్లు పుత్తూరు నుంచి....

1947 జూన్ 9వ తేదీన చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామపురంలో ముద్దుకృష్ణమ జన్మించారు. ఆయన లెక్చరర్. ఆయన గుంటూరులోని పెద నందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న సమయంలో 1983లో ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. పుత్తూరు నియోజకవర్గం నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయి రికార్డులకెక్కారు. ఆయన మూడు సార్లు మంత్రిగా పనిచేశారు. విద్యాశాఖ, అటవీశాఖ, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో పుత్తూరు నియోజకవర్గం విడిపోయి నగరి నియోజకవర్గంగా ఏర్పడటంతో అక్కడ పోటీ చేశారు.

టీడీపీ నేతల దిగ్భ్రాంతి.....

గత ఎన్నికల్లో నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు. ఆయన వైరి పక్షంపై విరుచుకుపడటంలో దిట్ట. గాలి ముద్దుకృష్ణమ నాయుడి మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా చెప్పొచ్చు. చిత్తూరు జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయం. గాలి ముద్దుకృష్ణమ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Similar News