ఏపీలో అధికార విపక్ష పార్టీలు చేపట్టిన కార్యక్రమాలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయా..? అవుననే అనేక చోట్ల సాగుతున్న కార్యక్రమాలు చెప్పక చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా గడప గడపకు వైసిపి , వైఎస్ ఆర్ కుటుంబం డిజైన్ చేసి జనంలోకి దూసుకుపోయింది వైసిపి. అధికారపక్షం సైతం ఇంటింటికి టిడిపి కార్యక్రమానికి రూపకల్పన చేసి ప్రజల్లో తిరగాలని క్యాడర్ కి దిశా నిర్దేశం చేసింది. రోజుల తరబడి సాగే ఈ కార్యక్రమాలను ఆయా పార్టీల లీడర్లు పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నిర్వహించడం లేదు. మొక్కుబడి తంతు గా లాగించేస్తున్నారు.
వైఎస్ ఆర్ కుటుంబం కాన్సెప్ట్ గా మార్చేస్తున్న క్యాడర్ ...
వైసిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన కార్యక్రమం వైఎస్సాఆర్ కుటుంబం. దీని కాన్సెప్ట్ ప్రతి ఇంటికి వెళ్ళి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లేదా డివిజన్ ఇన్ ఛార్జ్ సమస్యలు స్వయంగా తెలుసుకోవాలి. పార్టీ కేంద్ర కార్యాలయానికి మిస్ కాల్ ఇస్తే అక్కడి నుంచి కాల్ వస్తుంది. ఆ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్య నమోదు చేస్తారు. వైసిపి అధికారంలోకి వచ్చిన 100 రోజులు లోగా వారి సమస్య కు పరిష్కారం చూపిస్తారు. అలాగే నవరత్నాల హామీలను ఆ కుటుంబానికి అర్ధం అయ్యేలా చెప్పి వైఎస్సాఆర్ కుటుంబ సభ్యులు గా నమోదు చేసుకోవడంతో పాటు తాము ఆ ఇంటిలోని వారితో మాట్లాడి వెళ్లినట్లు ఒక స్టిక్కర్ కూడా అంటిస్తారు. ఇలా చేయాలిసిన కార్యక్రమం లో ఇప్పుడు కరపత్రం ఇవ్వడం వారితో ఒక ఫోటో దిగడం, ఇంటికి స్టిక్కర్ తో అయ్యిందనిపిస్తున్నారు ఆ పార్టీ వారు.
టిడిపి క్యాడర్ ది అదే దారి ...
టిడిపి ఇంటింటికి తెలుగుదేశం కాన్సెప్ట్ చాలా చక్కగా డిజైన్ చేశారు. క్యాడర్ ప్రతి ఇల్లు తిరిగి ఆయా ఇంటిలోని వారి సమస్యలు నమోదు చేసుకోవాలి. ఆ సమస్యలు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలి. అలా ప్రజలతో మమేకం కావాలి. కానీ గ్రౌండ్ లో ఇవేమి జరగడం లేదు. ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చి పోవడం భారీ ఊరేగింపులు హడావిడి తప్ప ప్రజల సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించే దిశాగా కార్యక్రమం సాగడంలేదు.
కొంప ముంచుతున్న సొంత మీడియా ...
రెండు ప్రధాన పార్టీల క్యాడర్ సొంత మీడియా కవరేజ్ తో సంతృప్తి చెందుతున్నాయి. ఆయా పార్టీల ఛానెల్స్, పత్రికల ఫోటో వీడియో సెషన్ పూర్తి అయ్యాక దుకాణం మూసేస్తున్నారు. కొన్ని చోట్ల సభలు పెట్టి తమ ప్రభుత్వం చేపట్టిన ప్రచార కార్యక్రమాలు వివరించి మమ అనిపిస్తున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యానే వీరంతా ముఖం చూపిస్తున్నారన్న అంశం ప్రధానంగా ప్రచారం లో వుంది. దాంతో టిడిపి, వైసిపి అధినేతలు చేసే పార్టీ సమీక్షలు, చేస్తున్న పర్యవేక్షణ బూడిదలో పోసిన పన్నీరులా మారింది.