జన్మభూమి కార్యక్రమం తెలుగుతమ్ముళ్లకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లవుతున్నా సమస్యలు మాత్రం ఎక్కడివి అక్కడే ఉన్నాయని ప్రజలు నిలదీస్తున్నారు. ఇటీవల ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఇచ్చిన వినతుల సంగతేంటని కొన్ని గ్రామసభల్లో టీడీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను సయితం ప్రజలు వదలిపెట్టడం లేదు. గ్రామానికి రహదారి సౌకర్యం, మంచినీరు వంటి సౌకర్యాలు కల్పించకుండా ఎన్ని సంవత్సరాలు సాగదీస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో జన్మభూమి గ్రామసభలకు హాజరవుతున్న టీడీపీ నేతలు, అధికారులకు చాలా ఇబ్బందిగా మారింది.
ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న బాబు....
గత నాలుగు రోజుల నుంచి జరుగుతున్న జన్మభూమి కార్యక్రమం ఫీడ్ బ్యాక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తెప్పించుకున్నారు. ముఖ్యంగా కడప, అనంతపురం, గుంటూరు, విశాఖ వంటి జిల్లాల్లో ప్రజలు సమస్యలపై అధికారులను నిలదీస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. అయితే ఎక్కువగా వ్యక్తిగత సమస్యలనే ప్రజలు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా పింఛన్లు, రేషన్ కార్డులను మంజూరు చేయాలంటూ అధిక సంఖ్యలో ప్రతిపాదనలు వస్తున్నాయి. అయితే రేషన్ కార్డుల వరకూ ఓకే చెబుతున్న అధికారులు పింఛన్లు విషయంలో దాట వేస్తున్నారు.
ప్రతి చోటా ఘర్షణలే...
విజయనగరం జిల్లాలో జన్మభూమి గ్రామసభ రసాభాస అయింది. ఇక్కడ టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరికొకరు బాహాబాహీకి దిగారు. సమస్యలను ప్రస్తావించేందుకు వచ్చిన తమపై ఎలా దాడి చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సమస్యలుంటే వినతుల ద్వారా తెలియజేయాలని బహిరంగ నిరసనలు తెలియజేయకూడదని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రతి జన్మభూమిలో అర్జీలు తీసుకోవడం వాటిని పక్కన పడేయటం రివాజుగా మారిందని వైసీపీ ఆరోపిస్తుంది.
టీడీపీ వర్సెస్ బీజేపీ.....
ఇక గుంటూరు జిల్లాలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా వల్లూరివారితోటలో జన్మభూమి గ్రామసభను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సభావేదికపై ప్రధాని మోడీ ఫొటో లేకపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పథకాలను అమలు చేస్తూ మోడీ ఫొటో ఎందుకు పెట్టలేదని కమలం పార్టీ కార్యకర్తలు నిలదీశారు. అయితే ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని బీజేపీ నేతలపై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో రెండు పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇక కడప జిల్లా తొండూరు మండలం ఇనగలూరులో శాసనమండలి మాజీ వైస్ ఛైర్మన్, టీడీపీ నేతల సతీష్ రెడ్డిని కార్యకర్తలు నిలదీశారు. సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ఇక్కడకు రావాలని కోరడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిగారు. పోలీసులు సర్ది చెప్పి పంపాల్సి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు పహారా మధ్య జన్మభూమి గ్రామసభలను నిర్వహించాల్సి వస్తోంది. ప్రతి గ్రామసభలో ప్రజలు, విపక్ష పార్టీ కార్యకర్తలు నిలదీస్తుండటంతో అధికారులు, టీడీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.