జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు పుట్టించింది. నిన్నటి వరకూ పవన్ ప్రసంగాలు టీడీపీ నేతలకు చెవులకు ఇంపుగా విన్పించాయి. కాని నిన్నటి నుంచి మాత్రం అదే ప్రసంగం రుచించడం లేదు. దీనికి కారణం పవన్ కల్యాణ్ నేరుగా లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడమే. లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేయడమంటే పరోక్షంగా చంద్రబాబును అవినీతిలో ఇరికించినట్లేనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే పవన్ స్పీచ్ పై ఎదురుదాడికి దిగుతున్నారు.
పవన్ వ్యాఖ్యలు నమ్ముతారా?
నిన్నటి వరకూ జగన్ ను టార్గెట్ గా చేసిన టీడీపీ నేతలకు కొత్త శత్రువు వచ్చిపడ్డట్లయింది. ఒకరకంగా జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదంటున్నారు టీడీపీ నేతలు. పవన్ కల్యాణ్ ప్రసంగం చూసిన వారెవరైనా నమ్మే ప్రమాదముందని భావించిన టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. జగన్ మాటలను ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోరని, కాని నిన్నటివరకూ తమతో సన్నిహితంగా ఉన్న పవన్ కల్యాణ్ మాట్లాడితే ఆ ఆరోపణలను వాస్తవమని భావించే అవకాశముందని కొందరు టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. తమ పార్టీకి పవన్ ప్రసంగం భారీగా దెబ్బతీసిందని అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నారు.
చెడ్డపేరు తేనన్న లోకేష్....
పవన్ ప్రసంగాన్ని ఐదుకోట్ల మంది ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని, అసంబద్ధ, అకారణంగా అవినీతి ఆరోపణలు చేశారంటూ ధ్వజమెత్తారు. దీనిపై లోకేష్ కూడా స్పందించారు. ‘‘మా తాతగారు...నాన్న గారంత పేరు వస్తుందో లేదో తెలియదు కాని, వారి పేరు మాత్రం చెడగొట్టను’’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. ఇక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే ఏపీలో పవనం కమలం వైపునకు మళ్లిందన్నారు. ఒకవైపు జగన్ ను, మరోవైపు పవన్ ను మోడీ మోస్తున్నారని ఆరోపించారు. పవన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు.
పవన్ పై మంత్రుల ఫైర్....
ఇక మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా పవన్ పై ఫైరయ్యారు. పవన్ కు అత్తారింటికి దారెటో తెలియదన్నారు మంత్రి ఆది. పవన్ రాజకీయాన్ని ఒక సరదాగా తీసుకుంటున్నారని, పాలిటిక్స్ అంటే సినిమా కాదని ఎద్దేవా చేశారు. లోకేష్ పై చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు కూడా పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆవిర్భావ సభలో ఆవేశంగా మాట్లాడిన పవన్ రాష్ట్రా భివృద్ధికి ఏం చేస్తారో చెప్పకుండా టీడీపీపై విమర్శలు చేయడం తగదన్నారు. ఇది తెర వెనక కుట్రలో భాగంగా జరిగిందన్నారు. ఇలా పవన్ ప్రసంగం తమ పార్టీని డ్యామేజీ చేసిందని గ్రహించిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ పై ఫైర్ అయ్యారు.