టీడీపీ ప్రచారం వైసీపీకి కలసి వచ్చేనా?

Update: 2017-10-14 07:30 GMT

వైసిపి అధినేత జగన్ పాదయాత్ర ప్రకటన వచ్చిన రోజు నుంచి టిడిపి ఆయనకు ఉచిత ప్రచారం కల్పిస్తుంది. గతంలో పాదయాత్రలు చేసిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి , ప్రస్తుత సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠాలను అధిరోహించడంతో టిడిపి కి కొంత కలవరపాటు మొదలైంది. గుంటూరు ప్లీనరీలో వైసిపి అధినేత తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని తొలిసారి ప్రకటించారు . ఆరోజు మొదలు కొని ఈరోజు వరకు వైసిపి వారు కూడా చేయనంత ప్రచారం టిడిపి అధికారపార్టీ మీడియా లో పెద్దఎత్తున చేయడం చర్చనీయాంశంగా మారింది.

పాదయాత్రకు వ్యతిరేకంగా టిడిపి ప్రచారం ఉధృతం ...

రోజు అరడజను మంది మంత్రులు , డజను మంది ఎమ్యెల్యేలు అదే పనిగా పాదయాత్ర వ్యర్థం , వృధా అంటూ మీడియా ముందు చెప్పిందే చెప్పడం మొదలెట్టేశారు. అసలు వైసిపి పార్టీ వారు తమ అధినేత పాదయాత్ర ఎలా జరగబోతుంది ? ఏయే ప్రాంతాల మీదుగా తమ నేత ప్రయాణిస్తారు ..? ప్రజలతో ఎలా మైమకం కానున్నారు వంటి అంశాలను రోజు చెప్పుకోవాలిసివుంది. అది ఇంకా ప్రారంభం కాకుండానే టిడిపి ఉచితంగా పెద్దఎత్తున సాగిస్తున్న ప్రచారం వైసిపి కి ఒక రకంగా కలిసివస్తుంది. వాస్తవానికి ఏపీలో ప్రజలు జగన్ పాదయాత్ర ను సీరియస్ గా తీసుకోవడం లేదు . టిడిపి సృష్టిస్తున్న హైప్ తో వైసిపి అధినేత పాదయాత్ర అంశం ఆసక్తిగా మారింది.

టిడిపి విమర్శల్లో పాయింట్ లేదంటున్న విశ్లేషకులు ...

రాజకీయాల్లో వుండే వారు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం వారి సాధక బాధలు తెలుసుకోవడం సమస్యల పరిష్కారానికి పోరాటం చేయడం సర్వ సాధారణం. అందులోను విపక్షంలో వుండే వారు పాదయాత్రలు వంటివి చేయడం నేరుగా ప్రజలను కలుసుకోవడం ఆయా పార్టీలకే కాదు ప్రజలకు మేలు చేసేదే. అలా ప్రత్యక్షంగా ప్రజల్లో తిరగడం వల్ల గతంలో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను జనాలకు అందించారు. ఆ తరువాత అధికారం చేపట్టిన నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అంతకు ముందు 9 సంవత్సరాల తన పాలనకు భిన్నంగా పాదయాత్ర ఎఫెక్ట్ తో ప్రజలకు అవసరమైన సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారంలోకి వచ్చాకా దశలవారీ అమలు చేస్తూ వస్తున్నారు. అలా చేసిన ఆయన లేదా ఆ పార్టీ నేతలు విపక్ష నేత పాదయాత్రను వృధా... వృధా అంటూ పదే పదే చేస్తున్న విమర్శలు టిడిపి అంతర్గత ఆందోళనను తేటతెల్లం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల భావన.

Similar News