టీడీపీ పగ పడితే....?

Update: 2017-11-01 04:30 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ ఈరోజు పదవీ విరమణ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భన్వర్ లాల్ పై క్రమశిక్షణ చర్యలకు దిగింది. భన్వర్ లాల్ ప్రభుత్వానికి బకాయీ ఉన్న నాలుగు లక్షల రూపాయలను చెల్లించకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదేశించారు. ఆయన ప్రభుత్వ బంగ్లాను వాడుకున్నారని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించక పోవడం వల్లనే క్రమశిక్షణ చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈరోజు పదవీ విరమణ చేసిన భన్వర్ లాల్ నిజాయితీ కలిగిన అధికారి అని పేరుంది. ఆయన అనేక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు.

భన్వర్ లాల్ పై క్రమశిక్షణ చర్యలు....

అయితే ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీకి, ఎన్నికల కమిషనర్ గా ఉన్న భన్వర్ లాల్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చింది. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలుపర్చని చంద్రబాబును నడిరోడ్డుమీద కాల్చినా తప్పు లేదన్నారు. ఉరి తీసినా నష్టం లేదన్నారు. అయితే దీనిపై ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జగన్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. కాని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రచారం ముగిసిన తర్వాత జగన్ కు నోటీసులు జారీ చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భన్వర్ లాల్ కావాలనే జగన్ కు ఇచ్చే నోటీసులను ప్రచారం ముగిసిన తర్వాత ఇచ్చారని టీడీపీ నేతలు బహిరంగంగానే ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో జరిగిన సంఘటన కారణంగానే భన్వర్ లాల్ పై ప్రభుత్వం చర్యలకు దిగిందని ఐఏఎస్ వర్గాల్లో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది.

Similar News