టీడీపీ నేతలు కక్కలేక... మింగలేక...?

Update: 2017-10-19 03:30 GMT

తెలుగుదేశం పార్టీ నేతలకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. రేవంత్ పార్టీని వీడుతున్నట్లు బయటకు రావడం, ఆయన ఏపీ టీడీపీనేతలు, మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఏం చేయలేకపోతున్నారు. రేవంత్ రెడ్డికి టీడీపీ నేతల వల్లే ఇంత ఇమేజ్ వచ్చిందని, ఆయన తన సొంత ఇమేజ్ అని భ్రమపడుతున్నారని కొందరు టీటీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాని ఏపీ నేతలు మాత్రం ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఏపీలో జంపింగ్ లకు అవకాశం కల్పించడం వల్లనే. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ టీడీపీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్నగాక మొన్న వైసీపీ గుర్తు మీద గెలిచిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీని దెబ్బకొట్టే ప్రయత్నంలో రేణుకను హడావిడిగా పార్టీలో చేర్చుకున్నారు. అభివృద్ధి చూసే అందరూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుసయితం స్వయంగా ప్రకటించారు. ఇంకా అనేకమంది రావాలని ఏపీని అభివృద్ధి బాటలో పయనించాలంటే మరోసారి తనకు విజయం అందించాలని కూడా చంద్రబాబు కోరుతున్నారు.

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మాటేమిటి?

కాని పక్క రాష్ట్రంలో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పేల్చిన బాంబుకు మాత్రం నేతలకు మింగుడుపడటం లేదు. ఒకపక్క ఇక్కడ ఇతర పార్టీలో నుంచి ఎంపీలను చేర్చుకుంటుంటే... పక్క రాష్ట్రంలో పార్టీని వీడి వెళ్లే వారని ఏమనలేక.... మింగలేక.. కక్కలేక అల్లాడి పోతున్నారు. ఏపీ టీడీపీ నేతలెవ్వరూ రేవంత్ వ్యాఖ్యలపై స్పందించక పోవడం విశేషం. ఒక్క పరిటాల శ్రీరామ్ మాత్రమే ఈ విషయంలో స్పందించారు. తన పెళ్లిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయొద్దని మాత్రమే సూచించారు. ఇక టీటీడీపీ నేతలు మాత్రం కొంత స్వరం పెంచారు. రేవంత్ వెళ్లినా పార్టీకి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. దీపావళి తర్వాత టీటీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించనున్నారు. మొత్తం మీద టీడీపీ నేతలు మాత్రం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేసే సాహసం చేయలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం ఏపీలోని ఆపరేషన్ ఆకర్ష్ మాత్రమేనని చెప్పొచ్చు.

Similar News