టీడీపీ నేతను ఒంటరి చేసేస్తున్నారా....?

Update: 2017-11-26 08:30 GMT

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలో టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. రాజమండ్రి టీడీపీ నేతలు నగర మేయర్ రజనీశేషసాయిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. వ్యవసాయ కళాశాల శంకుస్థాపన కార్యక్రమానికి మేయర్ రజనీని కూడా ఆహ్వానించారు. అయితే శంకుస్థాపన శిలాఫలకంపై మేయర్ పేరు లేకపోవడంతో ఆమె బోరున విలపించారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడమెందుకు? తన పేరు లేకుండా తనను అవమానించడమెందుకు అంటూ ఆమె కంటతడి పెట్టుకున్నారు. దీనిపై పక్కే ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా పెద్దగా పట్టించుకోక పోవడంతో కార్యక్రమం మధ్యలోనే మేయర్ వెళ్లిపోయారు. రాజమండ్రి ప్రజాప్రతినిధులకు, మేయర్ కు మధ్య పొసగక పోవడం వల్లనే పేరు శిలాఫలకంపై కన్పించలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

గతంలోనే ఇలానే.....

ఇదొక్కటే కాదు... మేయర్ కు కొన్ని రోజుల కిందట కూడా అవమానం జరిగింది. ఇంటింటికీ టీడీపీ ముగింపు కార్యక్రమం రాజమండ్రి 42వ డివిజన్ లో వారం రోజుల క్రితం జరిగింది. అయితే ఈ వేదికపైన చుట్టుపక్కల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాని ఎక్కడా మేయర్ ఫొటో లేదు. దీంతో మేయర్ రజని సభా వేదికపై ప్రసంగిస్తూ తాను పార్టీలో ఉన్నానా? లేదా? తనకే అర్ధం కావడం లేదని ఆవేదన చెందారు. అయితే దీనికి గోదావరి అర్బన్ డెవలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ గన్ని కృష‌్ణ స్పందిస్తూ గౌరవం ఆపాదించుకుంటే రాదని, తమ పనుల ద్వారా సంపాదించుకోవాలని పరోక్షంగా మేయర్ కు చురకలంటించారు. ఇదే వేదికపై ఉన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా పొరపాటు వల్ల ఫొటో వేయకపోవచ్చని, పెద్దగా పట్టించుకోవలసిన అవసరంలేదని, మేయర్ తెలియని వారు ఎవరూ ఉండరన్నారు. హోెమంత్రి చినరాజప్ప కూడా తాను 30 ఏళ్లు పార్టీలో ఉన్నా ఏ ఒక్క రోజూ ఫొటో గురించి పట్టించుకోలేదని తెలిపారు. ఇలా మేయర్ ను రాజమండ్రిలో ఒంటరి చేసే ప్రయత్నం జరుగుతుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Similar News