టీడీపీ తగ్గేకొద్దీ బీజేపీ రెచ్చిపోతుందా?

Update: 2018-02-05 02:30 GMT

తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర బీజేపీ నేతలు మాటల దాడిన ఆపడం లేదు. పార్లమెంటరీ సమావేశం జరుగుతున్నప్పుడే ఆ పార్టీ నేతలు చేసిన సంచలన వ్యాఖ్యలు టీడీపీకి చికాకును తెప్పిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. ఆయన ఎప్పటిలాగా కాకుండా మరింత జోరు పెంచారు. తమ పార్టీ నేతలు నిప్పులాంటి వారని, టీడీపీ నేతలు అవినీతికి వారసులని చెప్పుకొచ్చారు. ఒక మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్న టీడీపీ నేతలు బీజేపీని అనే నైతిక హక్కులేదన్నారు. రెండకరాల రైతుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి సోము మాట్లాడటం సంచలనమయింది.

అమిత్ సూచనల మేరకేనా?

అయితే అమిత్ షా సూచనలు బీజేపీ రాష్ట్ర నేతలకు ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కువ భాగం కేంద్రం ఇచ్చే నిధులను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ బీజేపీ బలోపేతానికి టీడీపీ అడ్డుపడుతుందన్న అనుమానాన్ని గత కొంతకాలంగా బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోలవరం పనులు, ఉపాధి హామీ పనుల్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఒకవైపు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ బీజేపీని రాష్ట్రంలో భూస్థాపితం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలు ఎటువైపు దారి తీస్తాయోనన్న ఆందోళన వ్యక్త మవుతోంది.

మండిపడ్డ అయ్యన్న......

అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి అయ్యన్న మండి పడ్డారు. సోము వీర్రాజు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదని మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పదే పదే అధికార తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం మానుకుని కేంద్ర ప్రభుత్వం చేత రాష్ట్రానికి సాయం అందించేందుకు సోము కృషి చేస్తే బాగుంటుందని హితవు పలికారు. బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగినా ఆ మాట మాట్లాడకుండా కేంద్ర ఇచ్చిన నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని సోము మాట్లాడటం సరికాదన్నారు.

Similar News