టీడీపీ ఎమ్మెల్యే రగిలిపోతున్నాడెందుకో...?

Update: 2017-11-19 11:30 GMT

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. టీడీపీ ఘన విజయం సాధించింది. కాని అక్కడ పార్టీలో లుకలుకలు బయలుదేరాయి. ఎమ్మెల్యేలకు పడటం లేదు. మంత్రి అంటేనే ఆ ఎమ్మెల్యే మండి పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది. బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు ఓటమి పాలు కావడంతో ఆయన పార్టీ అధినేత అక్షింతలు వేశారు. అయినా కొండబాబు కాకినాడ డిప్యూటీ మేయర్ పదవిని తన సామాజిక వర్గానికి ఇప్పించుకోవాలని విపరీతంగా ప్రయత్నించారు. కాని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మ తన వర్గానికి ఇప్పించుకోగలిగారు. ఇది కొండబాబుకు పెద్ద ఎదురుదెబ్బే.

కొండబాబుపై చినబాబుకు ఫిర్యాదు....

కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబు మత్స్యకార వర్గానికి చెందిన వారు. తన సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీనికితోడు హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జోక్యం మితిమీరిపోవడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. దీంతో ఇటీవల జరిగిన సభలో తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనమేంటని ధ్వజమెత్తారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాుదు చేయనున్నట్లు హెచ్చరించారు. కాకినాడలో అధిక సామాజిక వర్గాన్ని విస్మరించడమేంటని కొండబాబు నేరుగా ప్రశ్నించారు. మంత్రి సోదరుడు సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో కొండబాబుపై చినబాబుకు చినరాజప్ప ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మొత్తం మీద కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీలో చిచ్చుపెట్టాయనే చెప్పొచ్చు.

Similar News