నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తప్పించుకు తిరుగుతున్నారా? అవుననే అంటున్నారు మహారాష్ట్ర పోలీసులు. టీడీపీ ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై ఏసీబీ అధికారులు మరో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. దీనిపై మహారాష్ట్ర ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలోని నీటిపారుదల శాఖలో బొల్లినేని రామారావుకు సంబంధించిన సంస్థ బొల్లినేని కన్స స్ట్రక్షన్స్ కాంట్రాక్టులను తీసుకుంది. ఈ పనుల్లో భారీగా అవినీతి జరగడంతో ఏసీబీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది.
చంద్రబాబు ఏం చేయనున్నారు?
అయితే బొల్లినేని రామారావు గత కొంతకాలంగా తమకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారని మహారాష్ట్ర ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేను విచారణ కోసం ప్రయత్నించినా ఆయన దొరకడం లేదని చెబుతున్నారు. దీంతో ఆయనపై మరో రెండు కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వచ్చిపడింది. అదే జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సీబీఐ విచారణ చేపట్టగానే ఆయనను పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. అలాగే మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని కూడా భూవివాదాల్లో చిక్కుకున్నారని ఆయనను కూడాపార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ రెండు స్పస్పెన్షన్లనూ టీడీపీ అధినేతచంద్రబాబు స్వయంగా ప్రకటించారు. మరి బొల్లినేని విషయంలో ఏం చేయనున్నారో చూడాలి మరి.