వైసీపీ అధినేత జగన్ బీసీ శంఖారావం పూరించారు. తాను చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పనని, వచ్చే ఎన్నికల్లో బీసీలకు అమలు చేయగలిగే హామీలనే ఇస్తానని జగన్ స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడలోని నూతన పార్టీ కార్యాలయంలో జగన్ బీసీ నేతలతో భేటీ అయ్యారు. ఈసమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమం కోసం జగన్ కార్యాచరణను ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం బీసీల అండతోనే అధికారంలోకి వస్తుందని, అయినా బీసీలకు చేస్తున్నదేమీ లేదని జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు. బీసీ ఓటు బ్యాంకు చూసుకునే చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారన్నారు. ఈ సందర్భంగా జగన్ బీసీ నేతలకు టార్గెట్ పెట్టారు. ఆరు నెలల్లో ప్రతి బీసీ ఇంటికి వెళ్లి వారిని కలుసుకుని సమస్యలను సేకరించాలని చెప్పారు. పాదయాత్ర ముగిసేలోగా ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత నేతలపైనే ఉందన్నారు. అప్పుడు క్షేత్రస్థాయిలో బీసీలు ఏం కోరుకుంటున్నారో తమకు తెలుస్తుందన్నారు. దీనిపై పాదయాత్ర ముగిసిన తర్వాత బీసీ గర్జన జరుపుతామని జగన్ ఈ సందర్భంగా ప్రకటించారు.
పాదయాత్ర తర్వాత బీసీ గర్జన.....
అంతేకాదు వచ్చే ఎన్నికల మ్యానిఫేస్టోలో సయితం బీసీ డిక్లరేషన్ పెడతామన్నారు. బీసీలకు న్యాయం జరిగే అంశాలే మ్యానిఫేస్టోలో పెడతామన్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు జగన్. తన పాదయాత్ర ముగిసేలోపు బీసీలకు సంబంధించిన అన్ని అంశాలను సేకరించాలని ఆదేశించారు. ఆరునెలల్లోనే బీసీ నేతలు తమకు అప్పగించిన పనిని పూర్తిచేసి తనకు నివేదిక ఇవ్వాలన్నారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, ఏడాదికి బీసీలకు పదివేల కోట్లు ఇస్తామని చెప్పి అరకొర నిధులను కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరునెలలు చంద్రబాబు చేసిన మోసాలను బీసీలకు వివరించాలని నేతలను కోరారు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అదీ విజయవాడలో పార్టీ కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం మరొక విశేషం.