టీటీడీ ప‌ద‌వుల వేట‌లో కులాల కుంప‌టి..!

Update: 2018-01-19 09:30 GMT

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ప‌ద‌వుల విష‌యం కులాల మ‌ధ్య కుంప‌టి పెడుతోందా? నేత‌లు త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌కే ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాలంటూ పంతాల‌కు పోతున్నారా? ఈ విష‌యం చంద్ర‌బాబుకు సైతం ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించిందా? తాజా ప‌రిస్థితి పీట‌ముడి దిశ‌గా దారితీస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. టీటీడీ పాల‌క మండ‌లి వ్య‌వ‌హారం రోజుకో ర‌కంగా మారుతోంది. గ‌డిచిన 9 నెల‌ల‌కు పైగా టీటీడీలో పాల‌క మండ‌లి లేకుండానే కార్య‌క్ర‌మాలు సాగుతున్నాయి.

చదలవాడను పక్కన బెట్టి....

గ‌త పాల‌క‌వ‌ర్గానికి చైర్మ‌న్‌గా మాజీ ఎమ్మెల్యే చ‌ద‌ల‌వాడ కృష్ణ‌మూర్తి వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మ‌రోసారి త‌న ప‌ద‌వీ కాలాన్నే పొడిగించాల‌ని విన్న‌వించుకున్నా ఆయ‌న స‌తీమ‌ణి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రెబ‌ల్‌గా నామినేష‌న్ వేయ‌డంతో పాటు ఆయ‌న వ‌ల్ల పార్టీకి, ప్ర‌భుత్వానికి ఒరిగిందేమీ లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన చంద్ర‌బాబు ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారు. ఆ త‌ర్వాత ఈ ప‌ద‌వి రేసులో ఎంపీలు మాగంటి ముర‌ళీమోహ‌న్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావు ఇలా చాలా మందే పోటీ ప‌డ్డారు. అయితే చంద్ర‌బాబు ఇప్ప‌టికే ప‌ద‌వుల్లో ఉన్న వారికి టీటీడీ ఇచ్చేది లేద‌ని తేల్చిచెప్పారు.

బాబు సొంతజిల్లా నుంచే....

ఆ త‌ర్వాత కొంద‌రు మాజీ అధికారుల పేర్లు కూడా టీటీడీలో వినిపించాయి. టీడీపీలో పోటీ సంగ‌తి ఇలా ఉంటే ఈ బోర్డు నియామ‌కంపై అధికార పార్టీ స‌హా అధికార పార్టీ మిత్ర‌ప‌క్షం బీజేపీ నేత‌లు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, దీనికి రాజ‌కీయ దుమారం ముసురుకోవ‌డంతో చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తూ వ‌చ్చారు. అయితే, ఇప్పుడు రాజ‌కీయంగా దుమారం చ‌ల్లారేందుకు బాబు చ‌ర్య‌లు తీసుకున్నా.. కులాల వారీగా నియామకాల విష‌యం మాత్రం చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. రెడ్డి సామాజికవర్గ కోటాలో చంద్రబాబు సన్నిహితులైన జయంద్రారెడ్డి, బాబులురెడ్డిలు టీటీడీ బోర్డులో చోటు కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌నే వార్త‌లు బాబు సొంత జిల్లా నుంచే విస్తృతంగా వినిపిస్తున్నాయి.

వారికి ఎలా ఇస్తారు?

రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవి ఇచ్చారు.. కమ్మ సామాజికవర్గానికి చెందిన ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు..కనుక ఆ రెండు సామాజికవర్గాలకు చెందిన వారికి టీటీడీ బోర్డు పదవి ఎలా ఇస్తారని మిగతా సామాజికవర్గాలకు చెందిన నాయకులు ధ్వజమెత్తుతున్నారు. సామాజికవర్గాన్ని పట్టించుకోకుండా పార్టీకి చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని ముగ్గురు, నలుగురు నాయకులకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేత‌లు కోరుతున్నారు.

బాబు ఎవరికిస్తారో...?

ఈ నేపథ్యంలో బాబు సొంత జిల్లా చిత్తూరులో పదవి కోసం వివిధ సామాజికవర్గాలకు చెందిన నాయకుల మధ్య పోటాపోటీ నెలకొంది. అదేవిధంగా హైద‌రాబాద్ నుంచి కూడా బీజేపీ నేత‌ల నుంచి పోటీ ఎదుర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక్క‌డ కూడా ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి టీటీడీ బోర్డులో ఉన్నారు. అయితే, ఈయ‌న స్థానంలో యాద‌వుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కొంద‌రు డిమాండ్ చేస్తున్నారు. ఇక‌, క‌డ‌ప జిల్లా నుంచి కూడా ఇదే విధమైన అభ్య‌ర్థ‌న‌లు ఊపందుకుంటున్నారు. అయితే, ప్ర‌దానంగా రెడ్డి వ‌ర్సెస్ క‌మ్మల మ‌ద్య టీటీడీ బోర్డు ప‌ద‌వుల వివాదం తార స్థాయికి చేరుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌ధ్య‌లో కాపులు, బ‌లిజ‌లు సైతం త‌మ‌కూ ప‌ద‌వులు కావాల‌ని పోటీ ప‌డుతున్నారు. మ‌రి దీనిని బాబు ఎలా ప‌రిష్క‌రిస్తారో చూడాలి.

Similar News