టీజీ వ్యాఖ్యల వెనక మతలబేంటి?

Update: 2017-11-03 04:30 GMT

రాయలసీమ హక్కుల కోసం సంస్థను ఏర్పాటు చేసి పోరాటం చేసి చేసి విసిగిపోయారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. ఏపీలో సీమకు జరుగుతున్న అన్యాయం పై ఆయన పదే పదే గళం ఎత్తేవారు. ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని దింపి ఖంగుతిన్న బైరెడ్డి మౌనాన్ని ఆశ్రయించారు. కర్నూలు ను రాజధాని చేయాలని, కనీసం హై కోర్టు అయినా ఇక్కడ పెట్టండి అంటూ బైరెడ్డి పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ సీన్ లోకి వచ్చారు. టీజీ వెంకటేశ్ కు ఇప్పుడు రాయలసీమ మీద అభిమానం పెరిగినట్లుంది. రెండో రాజధాని ప్రస్తావన ఇప్పుడే ఎందుకు తేవాల్సి వచ్చింది? ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం, జగన్ పాదయాత్ర జరుగుతుండటంతోనే ఈవ్యాఖ్యలు చేశారా?

రెండవ రాజధాని కర్నూలు కావాలి ...

వెనుకబాటుకు గురైన రాయలసీమ జిల్లాలకు న్యాయం జరగాలని టిజి వెంకటేష్ డిమాండ్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. కర్నూల్ ను రెండవ రాజధానిగా గుర్తించాలని , రాయలసీమ , ఉత్తరాంధ్ర లకు హై కోర్ట్ బెంచ్ లు ఏర్పాటు చేయాలనీ టీజీ కోరుతున్నారు. ఉమ్మడి ఏపీ విడిపడటానికి ముందు సమైక్య పోరు ను వెంకటేష్ ఉదృతంగా నిర్వహించారు. ఆయన పోరాటం అధిష్టానం ముందు వీగిపోయింది. ఇప్పుడు వైసిపి అధినేత జగన్ పాదయాత్ర నేపథ్యంలో రాయలసీమ నేతలకు తమ ప్రాంత అన్యాయాలు గుర్తుకు వచ్చి అధికారపార్టీ లో వున్నా ప్రతిపక్షం చేయాలిసిన డిమాండ్లు తెరమీదకు ఒక్కక్కరు తేవడం గమనార్హం. అందులోను జగన్ పాదయాత్ర రాయలసీమ జిల్లాలలో ముందుగా జరుగుతూ వున్న నేపథ్యంలో విపక్షం లేవనెత్తే అన్ని సమస్యలు అధికార పార్టీ నేతలే చేయనున్నట్లు స్పష్టం అవుతుంది.

Similar News