ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు జనంతో మమేకం అయ్యే తీరు మారుతూ వస్తుంది. తాజాగా తన నవరత్న కార్యక్రమాలపై వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు వైసిపి అధినేత. అందులో ఏ వర్గం వారికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఆ వర్గం ప్రజలు తారసపడినప్పుడు జగన్ వారికి తనదైన శైలిలో పాఠం చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర లో పాల్గొన్న ఆయన పేద బడుగు బలహీనవర్గాల ప్రజలతో ప్రత్యేకంగా రోడ్డుపై సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ప్రకటించిన నవరత్న హామీల్లో ఒకటైన ... పిల్లలను బడికి పంపితే కలిగే ప్రయోజనాలు వివరించి ఆకట్టుకున్నారు.
మీ పిల్లలు స్కూల్ కి వెళితేనే ....
పేదరికం కారణంగా తమ పిల్లలను పనులకు పంపే వారి వైఖరిలో మార్పు తెచ్చే ప్రయత్నం ఒక స్కూల్ మాస్టర్ లా చేశారు వైసిపి అధినేత. మీలోని పేదరికం పూర్తిగా పోవాలంటే మీ బిడ్డలు స్కూల్ కి వెళ్లేలా కృషి చేయండి. అలా మీరు చేసినట్లు అయితే వైసిపి అధికారంలోకి రాగానే ప్రతి తల్లికి ఏడాదికి 15 వేలరూపాయలు ప్రోత్సహకాన్ని వారి కి అందిస్తామని చెప్పారు జగన్. ఇది ప్రతి తల్లికి చేరవేయాలని పేదల పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు గా తయారు అయినప్పుడే ఆర్ధిక అసమానతలు తొలగిపోతాయంటూ జగన్ చెప్పిన మాటలకు స్థానికుల నుంచి అనూహ్య స్పందనే లభించింది. ఇలా ఒక్కో చోటా ఒక్కోలా వైసిపి అధినేత పాదయాత్రలో చేస్తున్న ప్రచారం అందరిని బాగా ఆకట్టుకుంటుంది.