టీఆర్ఎస్ సిట్టింగ్‌ల‌కు టెన్ష‌న్‌...ఎందుకంటే?

Update: 2018-01-13 07:30 GMT

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వివిధ పార్టీల నుంచి టీఆర్ ఎస్ లో చేరిన వారు, తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నాయకులు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు కొత్త ముఖాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇటీవల పలు నియోజకవర్గాల్లో నాయకుల హడావుడి కూడా అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న, రాజకీయంగా ఒడిదొడుకులకు గురవుతున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు వీరు పథకాలు రచిస్తున్నారు. ఓ వైపు అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకుంటూనే మరోవైపు ప్రజలకు దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు..

మానుకోటలో...

మానుకోట నుంచి టికెట్ కోసం పలువురు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవితకు ఈ సారి టికెట్ దక్కుతుందనే చర్చ జరుగుతోంది. తన తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ద్వారా టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. మెదక్ జిల్లాలో ఏఎస్పీగా పని చేస్తున్న నాగరాజు టికెట్ రేసులో ఉన్నట్లు చర్చించయకుంటున్నారు. ఇటీవల ఆయన నియోజకవర్గంలో పలు వర్గాలను ఆకట్టుకునే పనిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో మానుకోట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన టీడీపీ అభ్యర్థి మోహన్ లాల్, టీఆర్ ఎస్వీ నాయకుడు బానోత్ రవికుమార్ టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ది, మోహన్ లాల్ ది ఒకే గ్రామం.

వరంగల్ 'తూర్పు'లో..

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యే దయాకర్రావు సోదరుడు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు టికెట్ కోసం ప్రయత్నిస్తన్నారు. ఈసారి టికెట్ ఆయనకే దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టికెట్ రేసులో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ‌లో..

వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు, టీఆర్ ఎస్ రాష్ట్ర‌ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టికెట్ కోసం పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. పరకాల మండలం వరికోల్ కు చెందిన ఈయనకు కేసీఆర్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి.

జనగామలో...

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఈసారి టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ సన్నిహితుడు వంశీధర్‌రెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అదే విధంగా చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. తిరిగి టీఆర్ ఎస్ లో చేరేందుకు హరీష్ రావుతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈక్రమంలో టికెట్ కోసం ఇప్పటి నుంచే పావులుకదుపుతున్నారు.

భూపాలపల్లిపై ఆ ముగ్గురి కన్ను...

భూపాలపల్లి నియోజకవర్గం నుంచి స్పీకర్ మధుసూదనాచారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీని వీడి టీఆర్ ఎస్ లో చేరిన గండ్ర సత్యనారాయణకు టికెట్ ఖాయమైందని పలువురు చర్చించుకుంటున్నారు. అదే విధంగా కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఈ నియోజకవర్గంపై కన్నేసినట్లు సమాచారం. టికెట్ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు.

న‌ర్సంపేట‌లో...

నర్సంపేట నుంచి గతంలో ఓటమి పాలైన పెద్ది సుదర్శన్ రెడ్డి ఈసారి ఎలాగైనా గెలవాకలనే పట్టుదలతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి త్వరలో టీఆర్ ఎస్ లో చేరతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. టికెట్ పైహామీ పొందినాకే గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

డోర్నకల్ లో ...

గత ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్, కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థి రెడ్యానాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. అనంతరం రెడ్యానాయక్ గులాబీ గూటికి చేరారు. దీంతో ఇద్దరి నేతలు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో ఈసారి టికెట్ ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా ఇంకా ఆశావహుల సంఖ్య ఎన్నికల నాటికి ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News