ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చారు? పార్టీకి చేసిన సేవను గుర్తించి అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తుంది. గత ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించ లేకపోవడం, పార్టీకి, ప్రభుత్వానికి అవసరం ఉండటంతో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసి మండలికి పంపుతారు. కాని ఇప్పుడు ఎమ్మెల్సీలే ఎమ్మెల్యేలకు ప్రధాన శత్రువులుగా మారారు. సొంత పార్టీలో ఉన్న ఇద్దరూ ఒకరికొకరు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పో్టీ పడుతున్నారు. ఎమ్మెల్సీకి కేటాయించిన నిధులను తాము పోటీ చేయాలనుకున్న నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలకు మంత్రులను పిలుస్తున్నారు. హడావిడి చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్సీల దెబ్బకు తెలంగాణలోని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బెంబేలెత్తిపోతున్నారు. అధినేతకు ఎన్నిమార్లు చెప్పినా ఆయన పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గంలో వేలు పెడుతూనే ఉన్నారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్లేలు వర్సెస్ ఎమ్మెల్సీలుగా మారింది.
ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు....
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాలన్నది వీరి ప్రయత్నం. శాసనమండలి కంటే శాసనసభలో కూర్చోవడమే ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు గౌరవంగా భావిస్తారు. ఇలా ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మునుగోడు నియోజకవర్గంపై కన్నేశారు. కర్నె ప్రభాకర్ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ వాణిని వినిపిస్తూనే ఉన్నారు. ఆయన అధికార ప్రతినిధి కూడా. కర్నె ప్రభాకర్ కు గత ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఆయనను మండలికి పంపారు.ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మునుగోడు నుంచి పోటీ చేయాలని కర్నె ప్రభాకర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం నియోజకవర్గంలో తన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని కార్యక్రమాల్లో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. పోలీసుల జోక్యం లేకుండా అక్కడ అధికార కార్యక్రమాలు నిర్వహించడం కష్టమే. ఇక ఎమ్మెల్సీ కొండామురళి పరకాల టిక్కెట్ ను ఆశిస్తున్నారు. కొండా మురళి సొంత నియోజకవర్గం కావడంతో ఆయన అక్కడ దృష్టి పెట్టారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చల్లా ధర్మారెడ్డికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి గోవర్థన్, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. భూపతిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాలన్నీ అధినేత కేసీఆర్ కు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల మధ్య వివాదాలు మరింత ముదిరిపాకాన పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇవి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.