టీఆర్ఎస్ నేత పార్టీని వీడనున్నారా?

Update: 2017-10-12 09:30 GMT

టీడీపీ నుంచి వచ్చిన వారికే టీఆర్ఎస్ లో పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. టీడీపీ నుంచి వచ్చిన నేతలు ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లోనూ అహర్నిశలూ కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. ఇందుకు మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గమే ఉదాహరణ. నారాయణ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా రాజేందర్ రెడ్డి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన శివకుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే టీడీపీ నుంచి విజయం సాధించిన రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన శివకుమార్ రెడ్డి అప్పటి వరకూ నారాయణపేట నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరించారు. అప్పటి వరకూ ఆయన చెప్పిన పనులే జరిగేవి. ఎన్నికల్లో తన వెంట ఉన్న కార్యకర్తలకు శివకుమార్ రెడ్డి పనులు చేయిస్తూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత శివకుమార్ రెడ్డి ప్రాబల్యం తగ్గుతూ వచ్చింది.

స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేయాలని......

ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికే ప్రాధాన్యం పెరగడంతో శివకుమార్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నారు. ఇటీవల నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కేటీఆర్ వద్ద కూడా తన గోడును వెళ్లబోసుకున్నారు. అయితే కేటీఆర్ వెంటనే మంత్రులను పిలిపించి శివకుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అయినా అమలు జరగడం లేదు. దీంతో ఇటీవల జరిగిన సమావేశంలో తనకు వేదికపై చోటు కల్పించలేదని ఏకంగా మంత్రి లక్ష్మారెడ్డినే శివకుమార్ రెడ్డి నిలదీశారు. ఇంతేకాకుండా నామినేటెడ్ పదవులన్నీ ఎమ్మెల్యే తన వెంట వచ్చిన వారికే కట్టబెడుతున్నారని, దీంతో పార్టీకోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు రావడమూ కష్టమేనని భావిస్తున్న శివకుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలా? లేక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలా? అన్న దానిపై అనుచరులతో మంతనాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలను పరిష్కరించకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Similar News