టిడిపి, బిజెపి నడుమ దూరం బాగా పెరుగుతుంది. పొత్తు ధర్మం పచ్చ పార్టీ పాటించడం లేదంటూ కాషాయ దళ ఎమ్యెల్యే గళం విప్పారు. రాజమండ్రి ఎమ్యెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ టిడిపి వైఖరిపై ఒంటికాలిపై లేచారు. ప్రజాధనాన్ని ఖర్చు చేయడంలోనే కాదు జవాబుదారీ తనంలో కూడా పారదర్శకత వుండాలంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పధకాలను కొద్దిపాటి పేరు మార్పులతో తమ సొంత కార్యక్రమాలుగా ప్రచారం చేసుకుంటున్నా కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోలేదని ప్రజలకు మంచి జరిగితే చాలు అని భావించిందని దానిని చేతగానితనంగా భావించి పోలవరం ప్రాజెక్టుపై, బిజెపిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. నిజాలు దాచి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. పోలవరం నిర్మించేది ముమ్మాటికీ కేంద్రమే ఈ వ్యవహారంలో ప్రజలకు నిజాయితీగా నిజాలు చెప్పాలన్నారు టిడిపిని డాక్టర్ ఆకుల.
బిజెపి మైండ్ గేమ్ మొదలెట్టిందా .....
బీజేపి ఏపీలో మైండ్ గేమ్ గట్టిగా స్టార్ట్ చేసింది. ముందుగా పోలవరం ప్రాజెక్టుపై ఆ పార్టీ దృష్టి పెట్టి అన్ని తామేనని రాష్ట్రప్రభుత్వం కేంద్రం ముందు మోకరిల్లే పరిస్థితి కల్పించింది. టిడిపి ఈ భారీ ప్రాజెక్ట్ తామే నిర్మించామని చెప్పుకుంటే భవిష్యత్తులో కూడా మైలేజ్ ఆ పార్టీకే దక్కుతుందని భావిస్తున్న కమలనాధులు ఇప్పుడు స్పీడ్ పెంచారు. నిధులు ఇచ్చేది తామే, నిర్మాణం చేసేది తామే అన్నది స్పష్టమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే పని మొదలు పెట్టింది. మిత్రపక్షం పై మెతక వైఖరితో వున్న కమలనాధులు ఇప్పుడు ఒక్కోరు బయటకు వచ్చి టిడిపి ని హెచ్చరించే స్థాయిలో మాట్లాడటం వెనుక ఇదే ధోరణి ప్రస్ఫుటమౌతుందని విశ్లేషకుల అభిప్రాయం. పొత్తు వున్నా లేకున్నా సొంత కాళ్లపై నిలబడాలన్న వ్యూహంతోనే కమలం పార్టీ అడుగులు పడుతున్నాయని తేలిపోయిందని అంటున్నారు