నిన్నటివరకు మిత్రులుగా ఉంటూనే యుద్ధం చేసుకున్న బిజెపి టిడిపి లు ఇప్పుడు తమ మాటల యుద్ధానికి మరింత పదును పెంచాయి. పొత్తు బంధాన్ని టిడిపి ఎప్పుడైతే పూర్తిగా తెగతెంపులు చేసుకుందో ఇక రెండు పార్టీలు విమర్శలు, ఆరోపణల్లో మునిగి తేలుతున్నాయి. ఉగాది వేదికపైనే ఎపి సిఎం చంద్రబాబు బిజెపి పై నిప్పులు చెరిగారు. కమలం పార్టీ తనపై యుద్ధానికి సిద్ధం అంటుందని ఎవరిపై వారు యుద్ధం చేస్తారని తెలుగుజాతిపైన చేస్తారా? అంటూ సెంటిమెంట్ ఆయుధాన్ని బయటకు తీశారు సిఎం. కేంద్రం చేయాలిసింది చేయకపోగా ఇప్పుడు ఎదురుదాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
జాతి సెంటిమెంట్ ఆయుధంతో బాబు ...
విభజన హామీలు అమలు చేయకపోవడం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని అడిగితే బిజెపి తనపై దాడికి దిగాలని పార్టీ శ్రేణులకు చెప్పడాన్ని చంద్రబాబు ఆక్షేపించారు. ఈ రాజకీయ అంశాన్ని తెలుగుజాతిపై దాడిగా అభివర్ణించి తన అనుభవాన్ని చాటిచెప్పారు సిఎం. బిజెపితో పాటు కేసుల కోసం వైసిపి రాజీ పడిందని, పవన్ నాలుగేళ్లు పక్కనే వున్నప్పుడు కనపడని అవినీతిని ఇప్పుడు అడగడాన్ని బాబు తప్పు పట్టారు. పవన్, జగన్ పేర్లు ఎత్తకుండా చంద్రబాబు పదునైన విమర్శలే ఇద్దరిమీద గుప్పించారు. తనను బలహీనపర్చడానికి కేంద్రం కుట్ర పన్నిందని, తమిళనాడు తరహా రాజకీయాన్ని ప్రయోగించాలని చూస్తుందని దుమ్మెత్తిపోశారు. కానీ ఏపీలో కేంద్రం ఆటలు సాగే ప్రశ్నే లేదంటూ ఛాలెంజ్ విసిరారు. అయితే పవన్ ఇచ్చిన షాక్ నుంచి అధినేత ఇంకా కోలుకున్నట్లు కనపడలేదు. గత కొన్నేళ్లుగా చిరునవ్వులు చిందించే చంద్రబాబు పవన్ గుంటూరు సభ తరువాత డల్ అయినట్లు ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతుంది.