టిడిపి ఎంపీల వ్యూహం ఇదేనా ...?

Update: 2018-02-04 03:30 GMT

బడ్జెట్ లో ఏపీకి అన్యాయం పై ఎంపీల వ్యూహం ఏమిటి ? రాజీనామాలు చేసి ప్రజల్లోకి వచ్చి పోరాడాలన్నది ప్రజల అభిమతం. లేదా కనీసం కేంద్రమంత్రులైనా రాజీనామా చేసి పార్లమెంట్ సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఎపికోసం గళమెత్తాలన్నది ఆంధ్రుల ఆలోచన. టిడిపి అధ్యక్షుడు ఏపీ సిఎం పార్లమెంట్ సభ్యులతో నిర్వహించనున్న కీలక సమావేశంలో ఏం జరగబోతుంది అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ సీఎం సమావేశం ప్రశ్న పత్రం ముందే లీక్ అయ్యింది. ఇంతకీ మన ఎంపీలు గట్టిగా పార్లమెంట్ వేదికగానే పోరాడాలని భావిస్తున్నారు అని తేలింది.

రాజీనామాలు చేస్తే పొమ్మంటారు....

ఢిల్లీ లో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొని తూర్పుగోదావరి జిల్లా లోని తన స్వగ్రామం వీరవరం చేరుకున్న టిడిపి లోక్ సభా పక్ష నేత తోట నరసింహం చిట్ చాట్ గా మాట్లాడుతూ అసలు సంగతి చెప్పేశారు. రాజీనామాలు చేస్తే పార్లమెంట్ లో రాష్ట్ర అభివృధ్ధికోసం అడిగే వారు ఎవరు ? రాజీనామాలు చేస్తామంటే చేయండి పోండి అంటారు. సమైక్యాంధ్ర ఉద్యమం లో ఏమి జరిగింది ? ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకే అక్కడే ఉండి పోరాడతాం. ఆవేశంగా రాజీనామాలు చేయడం వల్ల మనకే నష్టం అన్నారు కాకినాడ ఎంపీ నరసింహం.

కేంద్రం చాలానే చేసింది ...

తోట నరసింహం తన చిట్ చాట్ లో అనుకోకుండా కొన్ని నిజాలు మాట్లాడేశారు. ఏపీకి కేంద్రం చాలానే చేసింది. కానీ ఇంకా చేయాలిసింది చాలానే ఉందని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో హామీలు, అమరావతి నిర్మాణం ఇలా చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. ఒక పక్క నాలుగేళ్లుగా రాష్ట్రానికి బిజెపి సర్కార్ వల్ల కించిత్ ప్రయోజనం లేదంటూ జెసి దివాకర రెడ్డి, రాయపాటి సాంబశివరావు, టిజి వెంకటేష్ వంటి ఎంపీలంతా ఒంటికాలిపై లేస్తే కాకినాడ ఎంపీ బిజెపి సర్కార్ చాలా చేసింది ఇంకా చేయాలిసింది ఉందంటూ చేసిన వ్యాఖ్యలు టిడిపి లో దుమారం సృష్టించేలా వున్నాయి. మిగిలిన ఎంపీలు ఆయనపై కారాలు మిరియాలు నూరే పరిస్థితి వున్నా అధినేత ఆలోచనకు అనుగుణంగానే తామంతా నడుచుకుంటామని తోట చెప్పడం విశేషం. చంద్రబాబు మనసు ఎరిగి ప్రవర్తించే నరసింహం బాబు అనుసరించే వ్యూహాన్ని పసిగట్టే ఈ వ్యాఖ్యలు చేసి వుంటారనే పార్టీ నేతల్లో టాక్ నడుస్తుంది. సో టిడిపి ఎంపీలు, కానీ మంత్రులు రాజీనామాలు చేసే పరిస్థితి లేనట్లే అని తేలిపోతుంది. మరి బాబు చివరి వరకు వేచి చూసి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Similar News