మొత్తం 175 నియోజకవర్గ ఇన్ చార్జులతో సమావేశమైన జగన్ తన మనసులో మాటను కూడా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయమని, తనను నమ్మమని నేతలను కోరారు. నియోజకవర్గాల్లో విభేదాలు విడనాని కలసికట్టుగా కృషి చేయాలని, ఎమ్మెల్యే టిక్కెట్ రాకున్నా అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి సముచితమైన పదవులను ఇస్తామని వారికి స్పష్టంగా చెప్పారు. ఎవరు పనిచేస్తున్నారో... ఎవరుపక్క చూపులు చూస్తున్నారో తనకు తెలుసునని, ఆ ఆలోచన ఉన్న వాళ్లు ఇప్పుడే పార్టీని వీడి వెళితే మంచిదని జగన్ కొంచెం కటువుగానే చెప్పారు. కేవలం టిక్కెట్ల కోసమే పనిచేస్తామంటే కుదరని కూడా చెప్పారు. ఈ మూడున్నరేళ్ల నుంచి ఎవరు ఏం చేశారో తన వద్ద నివేదిక ఉందని కూడా హెచ్చరించారు. అందరూ కష్టపడితేనే పార్టీ కూడా బాగుంటుందని, అలాంటిది కష్టపడకుండా అందలమెక్కాలని చూడటం తగదని చెప్పారు. ఇందులో కొందరికి ఆర్థిక ఇబ్బందులున్నాయని తనకు తెలుసునని, వారికి పార్టీ అండగా ఉంటుందని కూడా భరోసా నిచ్చారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికే ఫైనల్ అని, అందులో సూచించిన వారికే టిక్కెట్లు దక్కుతాయని జగన్ స్పష్టంగా చెప్పారు. అలాగని సీట్లు దక్కని వారికి తాను అన్యాయం చేయనని మాట ఇస్తున్నట్లు కూడా వివరించారు.
రోజుకు 16 నుంచి 20 కిలోమీటర్లు......
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అంతా సిద్ధమవుతోంది. ఆయన రోజుకు 16 నుంచి 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. రోజుకు పదహారు కిలోమీటర్లు ప్రయాణిస్తే అనుకున్న సమయానికి పాదయాత్ర పూర్తవుతుంది. నవంబర్ 2వ తేదీనుంచి ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే జగన్ పాదయాత్రఆరు నెలల పాటు సాగుతుంది. మొత్తం మూడు వేల కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేపట్టనున్నారు. మొత్తం 120 నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగుతుంది.రూట్ మ్యాప్ లో లేని 55 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జగన్ చేపట్టనున్నారు. ఆరునెలల కాలం మొత్తం జగన్ జనంలోనే గడుపుతారు. ఈమేరకు పార్టీ నేతలందరితో మాట్లాడిన జగన్ తాను ప్రయాణించాలనుకుంటున్న రూట్ మ్యాప్ ను వారి ముందు పెట్టారు. ఏ రోజుకు ఏ నియోజకవర్గంలోకి వస్తానో స్పష్టంగా వారికి వివరించారు. పాదయాత్రకు ముందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఏంచేయాలో వారికి చెప్పారు. తన పాదయాత్ర నియోజకవర్గంలోకి ప్రవేశించే ముందే నియోజకవర్గంలో ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. అలాగే యువభేరిలను ఏర్పాటు చేయాలి. నేతలంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని జగన్ సూచించినట్లు తెలిసింది. మొత్తం మీద జగన్ తన పాదయాత్రకు ముందే జగన్ 175నియోజకివర్గాల్లో ఎన్నికల వేడిని పుట్టిస్తున్నారు.