టి సర్కార్ కి ఉమ్మడి హై కోర్ట్ మరో షాక్ ...!

Update: 2017-11-25 01:30 GMT

తెలంగాణ సర్కార్ కి హై కోర్టు లో మరో ఝలక్ తగిలింది. టీచర్ ఉద్యోగాల కోసం జీవో నుంబర్ 25 ను సవరించాలని కోర్టు తీర్పు చెప్పడం చర్చనీయం అయ్యింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తుందని ఆదిలాబాద్ కి చెందిన అరుణ కుమార్ కోర్టు గుమ్మం ఎక్కారు. తక్షణం జీవో నెంబర్ 25 ను సవరించి నిరుద్యోగులను రక్షించాలన్నది ఫిర్యాదు దారుడి వాదం. ఈ జీవో 25 ప్రకారం ఉద్యోగాల ప్రకటన 31 జిల్లాలుగా ప్రకటించారు. కొత్త జిల్లాలను పరిగణలోనికి తీసుకుంటే పాత 10 జిల్లాల తెలంగాణ వాసులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పిటిషనర్ వాదించారు.

ప్రభుత్వం చెప్పేదానికి చేసే దానికి పొంతనే లేదన్న పిటిషనర్ ...

కొత్త జిల్లాలు పరిపాలనా సౌలభ్యం కోసమని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి 31 జిల్లాలుగా విభజించి నిర్ణయం తీసుకోవడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని అభ్యంతరాలు లేవనెత్తారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన కోర్ట్ జీవో 25 సవరించాలని తీర్పు చెప్పింది. దాంతో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే టిఆర్ టి పరీక్షకు సిద్ధమైన యంత్రాంగం మొత్తం ఫార్మేట్ మార్చాలిసి వస్తుంది. ప్రభుత్వ న్యాయవాది సర్కార్ తీరును సమర్ధిస్తూ గట్టిగా వాదించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు టిఆర్ టి పరీక్షా నిర్వహణే సర్కార్ కి సవాల్ గా మారింది. దీనిపై టి సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

Similar News