వైసీపీ అధినేత వైఎస్.జగన్ చేస్తోన్న పాదయాత్ర ఇప్పుడిప్పుడే పార్టీ శ్రేణుల్లో మాంచి జోష్ నింపుతోంది. కడప నుంచి ప్రారంభమైన వైఎస్.జగన్ పాదయాత్రకు కడపలో కంటే కర్నూలులోనే మంచి ఆదరణ దక్కింది. జగన్ కర్నూలు జిల్లాలో ఎంట్రీ ఇవ్వగానే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పలువురు కీలక నాయకులు వైసీపీలో చేరారు. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన అఖిలప్రియ టీడీపీలోకి జంప్ చేసి మంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ పాదయాత్ర పత్తికొండ నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా టీడీపీకి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.
పార్టీలో చేరికలతో...
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం ఇలాకాలో పార్టీలో చేరికలు ఉండడంతో వైసీపీ ఆనందానికి అవధులే లేవు. ఇక జగన్ అక్కడే ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే తొలి అభ్యర్థిని డిక్లేర్ చేసి పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు. కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవి వచ్చే ఎన్నికల్లో పత్తికొండ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు. ఆ తర్వాత జగన్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న బనగానపల్లెలోకి ప్రవేశించారు. ఆ నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద తలకాయల్లో ఒకరైన జిల్లా టీడీపీ వైద్య విభాగం అధ్యక్షులు రామిరెడ్డి వైసీపీలో చేరిపోయారు. వాస్తవంగా చూస్తే గత ఎన్నికల్లో జిల్లాలో తిరుగులేని మెజార్టీ సాధించిన వైసీపీ తర్వాత ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బతో విలవిల్లాడింది. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి కూడా జిల్లాలో వైసీపీని బాగా కుంగదీసింది. ఇక జగన్ పర్యటనతో మళ్లీ తిరిగి వైసీపీ ట్రాక్ ఎక్కింది.
మాజీ ఎమ్మెల్యే ఆహ్వానంతో...
ఇక జగన్ సోమవారం అనంతపురం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ జిల్లా వైసీపీకి ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అనుచరుడు అయిన మధుసూదన్ గుప్తా జగన్‌ను కలిసి జిల్లాలోకి ఆహ్వానించారు. గుంతకల్ నుంచి 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మధుసూదన్ గుప్తా ఆ తర్వాత రాష్ట్ర విభజన టైంలో సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తన గురువు జేసీ టీడీపీలో చేరిపోయినా మధుసూదన్ మాత్రం రాజకీయంగా తటస్తంగా ఉండిపోయారు. ఇక ఇప్పుడు పొలిటికల్ రీ ఎంట్రీని వైసీపీతో ఇస్తున్నారు. వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయిన మధుసూదన్ జగన్‌ను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ను జిల్లాలోకి ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. జగన్ పాదయాత్ర చివర్లో ఆయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఏదేమైనా జగన్ పాదయాత్ర జిల్లాలో మరో 20 రోజుల పాటు ఉంటుంది. ఈ నేపథ్యంలో మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది.