అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఉడికిపోతున్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న తమిళనాడు రాజకీయాలపై ఆమె ఆగ్రహంతో ఉన్నారు. తన మేనల్లుడు దినకరన్ ను ఒంటరి చేసి బీజేపీ ఆడుతున్న నాటకంపై ఆమె మండిపడుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్థుడిగా భావించిన ప్రస్తుత సీఎం ఎడపాడి పళనిస్వామిని ఎలాగైనా పదవీచ్యుతుడిని చేయాలని భావిస్తున్నారు. అన్నాడీఎంకే గుర్తుపై ఎన్నికల కమిషన్ ఈ నెల 23వ తేదీనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈనెల 30వ తేదీకి దీనిని వాయిదా వేసింది. రెండాకుల గుర్తు చేయి జారిపోతే ఇక తనకు, తన కుటుంబానికి మనుగడ ఉందని భావించిన శశికళ ఎన్నికల కమిషన్ కు జైలు నుంచి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
జైలు నుంచి ఈసీకి లేఖ....
రెండాకుల గుర్తు కోసం పళనిస్వామి, పన్నీర్ సెల్వం సమర్పించిన అఫడవిట్లు అన్నీ నకిలీవేేనని శశికళ తన లేఖలో ఆరోపించారు. 1877 అఫడవిట్లలో 329 అఫడవిట్లలో ఉన్న సంతకాలన్నీ పళని, పన్నీర్ సెల్వం బ్యాచ్ ఫోర్జరీ చేసినవేనని శశికళ ఆరోపించారు. రెండాకుల గుర్తు కోసం రెండు వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఎడపాడి పళనిస్వామిని, పన్నీర్ సెల్వాన్ని ఇరుకున పెట్టేందుకే శశికళ ఈ లేఖ జైలు నుంచే రాసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తన మేనల్లుడు దినకరన్ ను ఎలాగైనా పోటీకి దింపి విజయం సాధించి ఇద్దరికీ గుణపాఠం నేర్పాలని శశికళ యోచిస్తున్నారు. ఇటీవల పెరోల్ పై బయటకు వచ్చిన అనంతరం శశికళ ఆర్కే నగర్ ఉప ఎన్నికపైనే ఎక్కువ సేపు నేతలతో మాట్లాడినట్లు సమాచారం. మొత్తం మీద శశికళ తొలిసారిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంతో ఇక అన్నాడీఎంకేలో రెండు వర్గాలు కలవవన్న సంకేతాలు వచ్చినట్లే.