జైపాల్‌రెడ్డి వ‌ర్సెస్ అరుణమ్మ...ఎందుకిలా?

Update: 2018-01-07 06:30 GMT

టీకాంగ్రెస్ నేత‌లు రూటు మార్చ‌డం లేదు. ఒక‌పక్క క‌లిసి క‌ట్టుగా ఉంటున్నామ‌ని చెబుతూనే.. మ‌రోప‌క్క ఒక‌రి వెన‌కాల మ‌రొక‌రు గోతులు తీసుకుంటూనే ఉంటున్నారు. కీల‌క నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు నిత్యం రగులుతూనే ఉంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో టికెట్ల కోసం ఆశావ‌హులు తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తున్నారు. స్థానిక నేత‌ల మ‌ధ్య మొద‌లైన ఒక‌ వివాదం.. కీల‌క నేతల‌ మ‌ధ్య విభేదాలు సృష్టిస్తోంది. త‌మ వ‌ర్గం వారికే సీటు ద‌క్కాల‌ని ఒక‌రు.. వారికి ద‌క్క‌కుండా మ‌రొక వ‌ర్గం ప‌ట్టుబడుతున్నారు. ప్ర‌స్తుతం పాల‌మూరు జిల్లాలో మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి, గ‌ద్వాల్‌ ఎమ్మెల్యే డీకే అరుణ మ‌ధ్య వివాదం తారాస్థాయికి చేరింది. త‌మ వ‌ర్గం వారికే టికెటు ద‌క్కించుకోవ‌డం కోసం వీరే నేరుగా రంగంలోకి దిగార‌ని తెలుస్తోంది.

ఫ్లెక్సీల్లోనే కన్పిస్తుందే....

నూత‌న సంవత్స‌రంతో పాటు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటుచేసిన బ్యాన‌ర్లు,ఫ్లెక్సీలు పార్టీలోని ఇద్ద‌రు కీలక నేత‌ల మ‌ధ్య ఆధిపత్య పోరుకు సాక్ష్యంగా నిలుస్తోంది. జిల్లా కాంగ్రెస్‌ నేతల మధ్య కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్‌ అగ్రనాయకులు... అంతర్గత విభేదాలను మాత్రం వీడ‌టం లేదు. ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తమ వర్గం వారికే టికెట్లు ఇవ్వాలంటూ నేతలు పంతానికి పోతున్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకులు మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి, మాజీమంత్రి డీకే అరుణ వర్గాల మధ్య ఈ పోటీ మరీ ఎక్కువగా సాగుతోంది.

ముగ్గురు పోటీ పడుతుండటంతో....

దేవరకద్ర నియోజ‌క‌వ‌ర్గంలో ఇంతవరకూ డీకే అరుణ వర్గం ఆధిపత్యమే కొనసాగింది.. కాగా ఇప్పుడు జైపాల్‌ రెడ్డి వర్గం పట్టుకోసం ప్రయత్నిస్తోంది. తమ వర్గానికే టికెట్‌ ఇప్పించుకోవాలని, జిల్లా పార్టీ అగ్రనాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇన్‌చార్జ్ డొకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి రెండో సారి టికెట్‌ ఆశిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కాటం ప్రదీప్‌కుమార్ గౌడ్‌ కూడా టికెట్‌ కోరుతున్నారు. వీరికితోడు లాయర్‌ మధుసూదన్‌ రెడ్డి కూడా రేస్‌లో ఉన్నారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. తాజాగా జైపాల్ వ‌ర్గానికి చెందిన ప్రదీప్‌ కుమార్‌ పండుగ శుభాకాంక్షలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇందులో తమ నేత ఫోటో లేదంటూ మరోవర్గం వాటిని తొలగించింది. దీంతో వ్యవహారం పోలీస్‌ కేసు దాకా వెళ్లింది.

వార్ మామూలుగా లేదు....

ఫ్లెక్సీలు కట్టి.. వివాదానికి కారణమయ్యాడని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న ప్రదీప్‌కుమార్‌ మాత్రం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ తనదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలు, తన అనుభవం కారణంగానే తనకు వస్తుందని చెబుతున్నార‌ట. ఇక్క‌డ త‌మ వ‌ర్గానికి చెందిన వాళ్ల‌కే అసెంబ్లీ సీటు ఇప్పించేందుకు జైపాల్‌, అరుణ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌డంతో వార్ మామూలుగా లేదు. దీంతో జైపాల్‌రెడ్డి, డి.కె.అరుణ వర్గీయుల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. కాంగ్రెస్‌లోకి రేవంత్ రెడ్డి రావ‌డానికి కార‌ణం జైపాల్ రెడ్డేన‌ని డీకే అరుణ వ‌ర్గం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే! రేవంత్ రాక‌ను తీవ్రంగా వ్య‌తిరేకించినా.. జైపాల్ కార‌ణంతోనే త‌మ వాద‌న‌ను ప‌ట్టించుకోలేద‌ని అసంతృప్తిలో ఉన్నారు అరుణ‌. ఇప్పుడు మరోసారి జైపాల్‌, అరుణ మ‌ధ్య వివాదం ఇంకెన్ని పరిణామాల‌కు దారితీస్తుందో!!

Similar News