జైట్లీ నీతి : అమ్మకు అన్నం పెట్టకుండా.. పిన్నికి పరమాన్నం!

Update: 2016-11-28 20:47 GMT

అమ్మకు అన్నం పెట్టడు గానీ.. పిన్నికి పరమాన్నం పెడతానన్నాడని.. ప్రబుద్ధుల బుద్ధుల గురించి ఓ నాటు సామెత ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణులు కూడా అదే తీరుగా కనిపిస్తున్నాయి. నోటు రద్దు వలన సామాన్య ప్రజలు లెక్కలేనన్ని, అనూహ్యమైన కష్టాలు ఎదుర్కొంటున్నారయ్యా అని మొరపెట్టుకుంటూ ఉంటే.. డిజిటల్ లావాదేవీల మాట చెబుతుంది సర్కారు. సరే.. సదరు డిజిటల్ లావాదేవీల్లోనూ ప్రజలకు భారం తగ్గేలా చూడండి.. వ్యాపారులకు భారం తగ్గే ఏర్పాట్లు మాత్రమే కేంద్రం చేయడం చాలా అనాలోచితంగా ఉంది.

స్వైపింగ్ మెషిన్ ల ద్వారా లావాదేవీ జరిగినప్పుడు సదరు వ్యాపారికి బ్యాంకు వారు కొద్దిగా రుసుము విధిస్తారు. దీనిని మర్చంట్ డిస్కౌంట్ రేట్ అని అంటారు. సాధారణంగా ఒకటి రండు శాతంగా ఇది ఉంటుంది. ప్రజలు అందరూ కార్డులు స్వైప్ చేసి డిజిటల్ లావాదేవీలు జరిగేలా ప్రోత్సహించాలంటే, ఈ ఎండీఆర్ ను పూర్తిగా తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్నాయి. సోమవారం నాడు ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ కూడా అదే కోరారు. ఎండీఆర్ ను పూర్తిగా తొలగించాలని అంటున్నారు. బ్యాంకు లు విధించే రుసుమును వ్యాపారులు వినియోగదారుడి మీదనే మోపుతారు. అలాంటి నేపథ్యంలో.. రుసుము తగ్గించాలని అందరూకోరుతున్నారు.

అయితే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆ విషయం పట్టించుకోకుండా, స్వైపింగ్ మెషిన్లు కొనుగోలు చేసే సమయంలో చెల్లించవలసి వచ్చే పన్నులను మాత్రం రద్దు చేస్తూ లోక్ సభలో సోమవారం బిల్లు పెట్టారు. ప్రతి దుకాణదారు కూడా స్వైపింగ్ మెషిన్ పెట్టుకునేలా ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అదే సమయంలో.. ప్రజలను ఆర్థిక లావాదేవీలను డిజిటల్ రూపంలో చేయడానికి ప్రోత్సహించేలా ఏం నిర్ణయం తీసుకుంటున్నారో మాత్రం ఎంతకూ అర్థం కావడం లేదు.

జైట్లీ అనుసరిస్తున్న నీతి పైన చెప్పుకున్న సామెత చందంగానే ఉంది. నానా అవస్థలు పడుతున్న సామాన్య ప్రజలకు లబ్ది కలిగే, లేదా వారిని ప్రత్యమ్నాయం వైపు ప్రోత్సహించే పని చేయడం లేదు గానీ, వ్యాపారులకు పరిమితమైన లబ్ధిని మాత్రం కలిగించే నిర్ణయం తీసుకోవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి.

Similar News