జేసీ వర్సెస్ ఎమ్మెల్యే...స్ట్రీట్ ఫైట్ కు రెడీ...!

Update: 2017-12-22 02:30 GMT

అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జేసీ బ్రదర్స్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాలు డైరెక్ట్ ఫైట్ కు దిగాయి. రెండు రోజుల క్రితం అనంతపురం మేయర్ స్వరూప ఎంపీ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జేసీ అనంతపురం అభివృద్ధికి అడ్డుపడుతున్న రాక్షసుడని జేసీపై మేయర్ స్వరూప విరుచుకుపడ్డారు. అయితే స్వరూప ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గంగా ఉంటున్నారు. దీంతో ఎమ్మెల్యే అండతోనే స్వరూప ఈ వ్యాఖ్యలు చేశారని జేసీ వర్గం భావించింది.

జేసీ అనుచరుడి బెదిరింపులు....

తాడిపత్రిలోని జేసీ బ్రదర్స్ అనుచరుడు శివనాయుడు మేయర్ స్వరూపను, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలను ఫోన్లో బెదిరించారు. శివనాయుడు ఆ ఇద్దరికీ ఫోన్ చేసి జేసీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివనాయుడు తమను బెదరించారన్న ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

పోలీస్ స్టేషన్లో జేసీ హల్ చల్....

శివనాయుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివనాయుడిని వెంటనే విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.తన అనుచరుడినే అరెస్ట్ చేస్తారా అంటూ ఎమ్మెల్యే జేసీ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్న పోలీసులు శివనాయుడిని స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పటి నుంచి అనంతపురం టీడీపీలో గొడవలు వీధిన పడ్డాయి.

Similar News